సత్తుపల్లి రూరల్, మార్చి 4 : అనుకోవడానికి సర్కారు బడి అయినా అన్నింట్లోనూ ఆదర్శంగా నిలుస్తున్న పాఠశాల అది. మెరుగైన వసతులు, ఉత్తమ ఫలితాలు దాని సొంతం. సర్కారు ఆధీనంలో ఉన్న ఏ స్కూల్లోనూ లేని విధంగా సైకిల్ స్టాండు, డైనింగ్ హాలు వంటి ప్రత్యేకతలు దానికి మాత్రమే సొంతం. తుమ్మల నాగేశ్వరరావు వంటి ఎందరో ప్రముఖులు చదివిన ప్రభుత్వ పాఠశాల అది. అదే సత్తుపల్లి మండలంలోని కిష్టారం ఉత్తమ జడ్పీహెచ్ఎస్.
విద్యతోపాటు విద్యార్థులకు ఇతర కృత్యాలపై శిక్షణ అందిస్తున్నారు ఉపాధ్యాయులు. క్రీడలు, క్విజ్, చిత్రలేఖనం తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. కబడ్డీ, ఖోఖో పోటీల్లోనూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు సత్తా చాటారు.
ఇంగ్లిష్ మీడియం చదవాలన్న నిరుపేదల కల సాకారమవుతోంది. ప్రతి పాఠశాలనూ తీర్చిదిద్దడంతోపాటు ఆంగ్ల విద్యను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తుల ఆకాంక్ష, ఉపాధ్యాయుల చొరవతో ఇప్పటికే ఈ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం బోధన కొనసాగుతోంది. మెరుగైన ఫలితాలు సాధిస్తూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తోంది. సకల సౌకర్యాలు కల్పించేలా నిధులు మంజూరు చేయనున్న తరుణంలో సర్కారు బడి సరికొత్త రికార్డు నమోదు చేయనుంది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు కొనసాగుతున్న ఈ పాఠశాలలో గడిచిన మూడు, నాలుగేళ్లుగా టెన్త్‌లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియం విజయవంతం కావడంతో పరిసర గ్రామాల విద్యార్థులు కూడా ఈ పాఠశాలకే వస్తున్నారు.
1963లో అప్పటి సత్తుపల్లి శాసనసభ్యుడు జలగం వెంగళరావు ఈ పాఠశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా అనేకమంది ప్రముఖులు ఈ పాఠశాలలో చదువుకున్నారు. ఇక్కడ విద్యనభ్యసించిన వారిలో ఎందరో ప్రముఖులయ్యారు. విద్యలో రాణించి ఉన్నత స్థానాలను అధిరోహించారు.
మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పాఠశాలకు చుట్టూ ప్రహరీ ఉంది. సైకిల్ స్టాండ్, విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు డైనింగ్ హాల్, వంట గది, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, ఆడుకోవడానికి విశాలమైన మైదానం, ఆవరణలో ఎత్తైన చెట్లు, ఆహ్లాద, ఆరోగ్య వాతావరణం ఈ పాఠశాల ప్రత్యేకం.
పూర్వ విద్యార్థులు పలువురు ఈ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. ఇక్కడే చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించిన వారు ఈ పాఠశాల అభివృద్ధికి చేయూతనందిస్తున్నారు. గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులందరూ కలిసి సైన్స్ ల్యాబ్, డయాస్, లైబ్రరీ, సైకిల్‌స్టాండ్, డైనింగ్ హాల్, జాతీయ నాయకుల విగ్రహాల వంటి వాటిని ఏర్పాటు చేశారు. బెంచీలు, డిజిటల్ ల్యాబ్ వంటివి సమకూర్చారు. ఏటా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. ఈ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 227 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 6 నుంచి 10 తరగతుల వరకు ఉన్న విద్యార్థుల్లో 142 మంది ఆంగ్ల మాధ్యమం, 85 మంది తెలుగు తెలుగు మాధ్యమం చదువుతున్నారు. రెండు విభాగాల్లోనూ మంచి ఫలితాలు వస్తుండడంతో పరిసర ప్రాంతాలైన చెరుకుపల్లి, జగన్నాథపురం, పెంట్లం, కొమ్మేపల్లి, మండాలపాడు తదితర గ్రామాల విద్యార్థులు కూడా ఈ పాఠశాలకే వస్తున్నారు. టెన్త్‌లో 2017లో 93 శాతం, 2018లో 76 శాతం, 2019లో 94 శాతం, 2020లో నూరుశాతం, 2021లో నూరుశాతం ఫలితాలు సాధించారు. ఏటా ఈ పాఠశాల నుంచి బాసర ట్రిపుల్ ఐటీకి సైతం విద్యార్థులు ఎంపికవుతుండడం విశేషం.
పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులందరమూ కలిసి శాశ్వత సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాం. దాని ద్వారా పాఠశాలకు వసతులు కల్పిస్తున్నాం. ఇప్పటికే పాఠశాల పేరుతో రూ.5.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేశాం. దాని వడ్డీని పాఠశాలలో మౌలిక అవసరాలకు వినియోగిస్తున్నాం. దాతల చేయూత, ప్రభుత్వ సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తాం.
-కొడిమెల అప్పారావు, పూర్వ విద్యార్థి, కిష్టారం
నాకు, నా ఫ్రెండ్స్‌కు ఇంగ్లిష్ మీడియం చదవాలన్న ఆకాంక్ష ఉండేది. కానీ ఇది కలగానే మిగిలిపోతుందనుకున్నాం. మా పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడంతో మాకు ఇంగ్లిష్ మీడియం కల నెరవేరింది. 8వ తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం చదువుతున్నా. ఉపాధ్యాయులు అర్థమయ్యేలా బోధిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
-ఎమ్మనబోయిన సాత్విక, విద్యార్థిని, కిష్టారం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం పేద విద్యార్థులకు వరం. ఇంతకుముందు ఆర్థిక భారం వంటి ఇబ్బందులతో పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం బోధించే ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేవారు కాదు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమ బోధన లభిస్తుండడంతో వారు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు – మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాయి. విద్యార్థులను దీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ఉపాధ్యాయులు నిరంతరం శ్రమిస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలూ సహకరిస్తున్నారు. -వేములపల్లి బాలకృష్ణ,
హెచ్ఎం, కిష్టారం