ఖమ్మం సిటీ, మార్చి 4: ‘యుద్ధం వస్తుందన్నారు. వట్టిదేనని కొట్టిపారేశారు. తెల్లారి లేచే సరికి బాంబుల వర్షం. దట్టమైన పొగలతో చీకటి అలముకుంది. ఒక్కసారిగా భయోత్పాతం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. మంచి నీరు కూడా దొరకని దుస్థితి. తిను బండారాల కోసం మూడు కిలోమీటర్ల ప్రయాణం. తాగునీటి కోసం 30 గంటలపాటు క్యూ. ఐదు రోజులపాటు బంకర్లో భయానక జీవితం. ఎట్టకేలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సొంత గడ్డపై కాలు. ఊపిరి పీల్చుకున్న విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మానికి చెందిన ప్రముఖ డాక్టర్ పూజ బాబూరావు కుమార్తె పూజ తపస్వి ఉక్రెయిన్‌లో మెడిసిన్ ఫిఫ్త్ ఇయర్ చదువుతోంది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య భయంకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న తపస్వి శుక్రవారం సాయంత్రం ఖమ్మానికి చేరుకున్నది. కన్నవారిని చూసి ఆనంద భాష్పాలు రాల్చిన ఆమెను ‘నమస్తే’ పలకరించగా ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
ఉక్రెయిన్ దేశంలో ఐదేండ్లుగా మెడిసిన్ చదువుతున్న. అక్కడి కర్కూవ్ పట్టణంలోని నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో ఐదవ సంవత్సరం పూర్తిచేస్తున్న. రష్యా ఉక్రెయిన్ దేశంపై యుద్ధానికి దిగుతోందని ఫిబ్రవరి 16న హెచ్చరికలు వచ్చాయి. సదరు వార్తా అంశాలను ఉక్రెయిన్ మీడియా సృష్టే అని పలు సంస్థలు కొట్టిపారేశాయి. అంత సీన్ లేదని గట్టిగా వాదించాయి. దీంతో అక్కడే ఆగిపోయాము. కానీ..! అదే నెల 26వ తేదీ తెల్లారి లేచి చూసే సరికి అక్కడి పరిస్థితులు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. బాంబుల మోతలతో కర్కూవ్ నగరం దద్దరిల్లుతోంది. బయటి వాతావరణం అంతా చీకటిగా మారింది. భయంకరమైన దృశ్యాలు. రష్యా ప్రత్యక్ష్య యుద్ధానికి దిగడంతో ఇంటర్నెట్ బంద్ అయ్యింది. కనీసం తినటానికి తిండి, తాగడానికి నీళ్లు లేవు. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మేము నివాసం ఉంటున్న నగరానికి మూడు కిలోమీటర్లు నడిచి ఒక షాపింగ్ మాల్‌కు వెళ్లి తిను బండారాలు తెచ్చుకున్న. తాగునీటి కోసం మూడుగంటల పాటు క్యూ లైన్లో నిలబడ్డాను. ఆహార పదార్థాలు, తాగునీరు వెంటబెట్టుకుని మేము నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ కింద ఉన్న బంకర్లోకి గత నెల 28న వెళ్లాను. ఆ సమయంలో మా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మా నాన్న గుర్తుకు వచ్చి చాలా ఏడ్చాను. ఇక్కడి నుంచి భారత్ వెళ్తే చాలు అని దేవుడిని వేడుకున్నా.
తెలంగాణా విద్యార్థుల తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని అక్కడి ఇండియా ఎంబసీ తెలిపింది. దీంతో నా సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంబసీ అధికారులను సంప్రదించాను. వారి సహకారంతో మేము ఉంటున్న ప్రాంతం నుంచి దాదాపు 20 గంటలు ప్రయాణించి ఉక్రెయిన్ లివీవ్ పట్టణం నుంచి సరిహద్దు దేశమైన పోలండ్‌కు చేరుకున్నాను. యుద్ధ భూమి నుంచి బయటపడగానే గట్టిగా ఊపిరి పీల్చుకున్న. ప్రత్యేక విమానం ద్వారా శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాను. దేశ రాజధానిలో విమానం ఎక్కి మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్, సాయంత్రానికి ఖమ్మం వచ్చాను. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నడూ ఊహించలేదు. ఎట్టకేలకు ఇంటికి చేరుకోవడం, కన్నవారిని, ఇతర కుటుంబ సభ్యులను కలుసుకోవడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తోంది. నేను ఇంటికి వచ్చేందుకు అన్నివిధాలా సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.