మణుగూరు రూరల్, మార్చి 4: ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. పర్యటన పూర్తిస్థాయిలో ఖరారు కాగానే అన్ని నియోజకవర్గాల్లో ఐదువేల మోటర్‌సైకిళ్లతో స్వాగత ర్యాలీలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఇతర సంఘాల నాయకులు, ముఖ్యనాయకులతో మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నియోజవర్గస్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు పరిష్కరించామని, గ్రామాల్లో చిన్న సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వాటిని గుర్తించి నివేదికలు అందజేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. బ్రిడ్జీల నిర్మాణానికి ఏప్రిల్‌లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇవి పూర్తి చేసిన అనంతరమే ప్రజల వద్దకు ఓట్ల కోసం వెళ్దామన్నారు. స్థానిక యువతకు ఉపాధి మార్గాలు పెంచేందుకు, మణుగూరును ఇండస్ట్రియల్ కారిడార్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉన్నందున మహిళాబంధును ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందని రేగా కాంతారావు పేర్కొన్నారు. ఈ మేరకు వాడవాడలా మహిళాబంధును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. మహిళల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను తెలియజెప్పేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. 6న మహిళాబంధు సంబురాలు ప్రారంభించి వాడవాడలా సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టాలని పిలుపునిచ్చారు. మహిళా పారిశుధ్య కార్మికులు, మహిళా డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశావర్కర్లు తదితరులను ఘనంగా సన్మానించాలని సూచించారు. 7న కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ సహా ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా కలుసుకోవాలని, లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవాలని సూచించారు. 8న నియోజకవర్గా కేంద్రాల్లో మహిళలతో సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించాలని సూచించారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వట్టం రాంబాబు, పోశం నర్సింహారావు, ప్రభుదాస్, కోలేటి భవానీశంకర్, పొనుగోటి భద్రయ్య, కామిరెడ్డి శ్రీలత, లక్ష్మీనారాయణరెడ్డి, షాబీర్పాషా, దొబ్బల వెంకటప్పయ్య, కత్తిరాము, ఎడ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.