ఖమ్మం లీగల్, సెప్టెంబర్ 28 : సమస్యల పరిష్కారానికి సరైన వేదిక లోక్ అదాలత్ అని ఖమ్మం జిల్లా జడ్జి వి.రాజగోపాల్ అన్నారు. ఖమ్మంలోని న్యాయ సేవాసదన్‌లో జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కొన్నేళ్లుగా జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నామని, వీటికి ప్రతిసారి విశేష స్పందన వస్తుందన్నారు. రెగ్యులర్ కోర్టు విధానంలో ఒక కోర్టులో తీర్పు వచ్చినట్లయితే ఒక పక్షం వాళ్లు గెలిచి.. మరోపక్షం వాళ్లు ఓడిపోతారని, అయితే లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాలు గెలుపొందే అవకాశం ఉంటుందన్నారు.
దీంతో కక్షిదారుల్లో సుహృద్భావ వాతావరణం పెంపొందుతుందన్నారు. మంచి మనస్సుతో ప్రయత్నిస్తే పరిష్కారం లేని సమస్య అంటూ లేదని, ఏదైనా కోర్టుకు వచ్చే వివాదాల అంతిమ పరిష్కారం లోక్ అదాలత్ ద్వారానే అని పునరుద్ఘాటించారు. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లా వర్షాలు, వరదలతో సతమతమైందని, అయినప్పటికీ కక్షిదారులు ఉత్సాహంతో లోక్ అదాలత్ ప్రక్రియలో పాల్గొనడం పట్ల ఆయన అభినందించారు. లోక్ అదాలత్లకు సహకరించిన న్యాయవాదులు, పోలీసులు, బీమా కంపెనీ ప్రతినిధులు తదితరులను న్యాయమూర్తి అభినందించారు. అనంతరం రాజీమార్గంలో పరిష్కారమైన మూడు కేసులలో కక్షిదారులను అభినందించి.. వారికి పూల మొక్కలు, లోక్ అదాలత్ అవార్డును అందజేశారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ ఆధ్వర్యంలో మొత్తం 10,820 కేసులను పరిష్కరించారు. ఇందులో 91 వాహన ప్రమాద కేసుల పరిష్కరించి, బాధితులకు రూ.4.52 కోట్ల పరిహారం అందజేశారు. మోటరు వాహన ప్రమాద కేసుల బెంచ్‌కి అదనపు జిల్లా జడ్జి ఎం.అర్చనకుమారి అధ్యక్షత వహించగా.. ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి కేవీ చంద్రశేఖరరావు ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించారు. అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎం.కల్పన పెండింగ్ సివిల్ కేసులను పరిష్కరించారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి క్రిమినల్ కేసులు, బ్యాంకు కేసులను పరిష్కరించారు. న్యాయమూర్తులు బి.రజని, వై.బిందుప్రియ, వి.మాధవి, శాంతిలత ఆయా కోర్టుల లోక్ అదాలత్ బెంచ్‌లలో క్రిమినల్ కేసులను పరిష్కరించారు.