ఖమ్మం, మే 5: యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏరోజుకారోజు దిగుమతి చేసుకోవాలని మిల్లర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ధాన్య కొనుగోళ్లు, దిగుమతుల అంశంపై మిల్లుల బాధ్యులు, సంబంధిత అధికారులతో ఐడీవోసీలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేపట్టామని, ఇప్పటి వరకు 222 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు.
ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో 127 కొనుగోలు కేంద్రాల ద్వారా 3860 మంది రైతుల నుంచి 36,442.040 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. ఇందుకోసం 213 మంది రైతులకు రూ.3,38,54,832 నగదును వారి ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా, తరుగు పేరుతో అన్నదాతలను ఇబ్బందులు పెట్టకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు రాయల వెంకట శేషగిరిరావు, కూరాకుల నాగభూషణం, నల్లమల్ల వెంకటేశ్వరరావు, ఎన్.మధుసూదన్, రాజేందర్, సోములు, విద్యాచందన, నాగరాజు, విజయనిర్మల, కిషన్‌రావు, విజయకుమారి, అనసూయ, రైస్ మిల్లర్స్ అసోసియోషన్ అధ్యక్షుడు బొమ్మా రాజేశ్వరరావు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులను పరిష్కరించాలి
లే అవుట్ రెగ్యులరైజేషన్ సీం దరఖాస్తుల పరిషారానికి వేగంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులకు సూచించారు. లే అవుట్ రెగ్యులేషన్ సీం అమలు, దరఖాస్తుల పరిష్కారంపై మున్సిపల్, రెవెన్యూ అధికారులతో ఐడీవోసీలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పాత అనధికార లే అవుట్ల విషయమై లే అవుట్ రెగ్యులేషన్ సీం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఇతర అధికారులు ఆదర్శ్ సురభి, వికాస్, ప్రసాద్, రమాదేవి, సుజాత, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా అంశంపై సంబంధిత అధికారులతో ఐడీవోసీలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణాలు పూర్తికాని చోట పనులను వేగవంతం చేయాలని సూచించారు. అధికారులు రంజిత్, కృష్ణాలాల్, పుష్పలత, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.