ఖమ్మం, జనవరి 26 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం సీపీ సునీల్‌దత్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు పనిచేస్తామన్నారు. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత తీసుకువస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆరుగ్యారెంటీల్లో ఇప్పటికే రెండు పథకాలను ప్రారంభించిందన్నారు. ఆరు గ్యారెంటీల లబ్ధి కోసం జిల్లావ్యాప్తంగా 4,88,316 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటన్నింటినీ ఆన్లైన్ చేయిస్తున్నామన్నారు. యువత ఓటర్లు నమోదులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌ల పనులను వేగవంతం చేస్తామన్నారు. ఖమ్మం రూరల్ నుంచి ఖమ్మం నగర పరిధిలో ప్రవహిస్తున్న మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ వాల్ నిర్మిస్తామన్నారు. జిల్లాలో కొత్తగా 54 చెక్‌డ్యాంల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయన్నారు.
పాలేరు, సత్తుపల్లిలో అందుబాటులోకి వచ్చిన నర్సింగ్ కళాశాలల్లో ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయన్నారు. రైతులందరీ ఖాతాల్లో 12వ విడత రైతుబంధు జమ అయిందన్నారు. కోదాడ నుంచి ఖమ్మం వరకు 31 కిలోమీటర్ల నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు 19.60 కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే అన్యాక్రాంతమైన సుమారు రూ.46.23 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నామన్నారు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నామన్నారు. వేడుకలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ఎస్.జగ్జీవన్‌కుమార్, న్యాయమూర్తులు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్‌నాయక్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్ మయాంక్ సింగ్, శిక్షణ ఐపీఎస్ మౌనిక, జిల్లా అటవీశాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్‌సింగ్, వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.