అన్ని ప్రభుత్వ భూముల్లో హరితహారం మొక్కలు నాటాలి
‘పల్లె ప్రగతి’ పనుల పరిశీలనలో ఖమ్మం కలెక్టర్ గౌతమ్
కూసుమంచి, జూన్ 16: జిల్లాలో కాలువ గట్లను గుర్తించి వాటిల్లోని ఆక్రమణలను తొలగించాలని ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ సూచించారు. ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిల్లో పూర్తిగా హారితహారం మొక్కలు నాటాలని ఆదేశించారు. అందుకు రెవెన్యూ, పంచాయితీ రాజ్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
గురువారం కూసుమంచి మండలంలో పర్యటించిన ఆయన.. సూర్యాపేట – ఖమ్మం రహదారిపై చేగొమ్మ క్రాస్ రోడ్డు వద్ద ఎస్ఆర్ఎస్పీ భూముల్లో హరితహారంలో మొక్కలు నాటుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో విదాయచందన, ఇరిగేషన్ సీఈ శంకర్‌నాయక్, రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ.. గతంలో కాలువల నిర్మాణం కోసం పరిహారం చెల్లించి రైతుల నుంచి తీసుకున్న భూములు ఆక్రమణలకు గురైనందున వెంటనే వాటిని గుర్తించాలని సూచించారు. వాటిల్లో పంటలు వేసే అవకాశం ఉన్నందున వాటిని స్వాధీనం చేసుకొని మొక్కలు నాటాలని సూచించారు.
డొంక ఆక్రమణలపై స్పందించిన కలెక్టర్..
జీళ్లచెరువు – కూసుమంచి డొంక ఆక్రమణ విషయాన్ని పలువురు రైతులు కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే ఆక్రమణలు తొలగించి రైతులకు డొంక ఉపయోగపడేలా చేయాలని సూచించారు.
పల్లె ప్రగతి పనులపై ఆరా..
మండలంలోని పల్లె, పట్టణ ప్రగతి పనులపై కలెక్టర్ ఆరా తీశారు. పనులు ఎలా జరుగుతున్నాయని కూసుమంచి సర్పంచ్ చెన్నా మోహన్‌ను అడిగి తెలుసుకున్నారు. మండలంలో పనులపై ఎంపీడీవో కరుణాకర్‌రెడ్డి, ఎంపీవో రామచందర్‌రావులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఈ నర్సిహరావు, ఈఈ సమ్మిరెడ్డి, ఎంపీపీ బాణోత్ శ్రీనివాస్, హరితహారం అధికారి వెంకట్రాం, ఎంఈవో రామాచారి, ధర్మాతండా సర్పంచ్ పింప్లీ, ఏడీఏ కోక్యానాయక్, ఏఈ వెంకన్న, ఏపీవో అప్పారావు, ఈసీ కరుణ, ఆర్ఐ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.