ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 1 : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, సీఎం దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాయి. అవమానకరంగా కేసీఆర్‌ను విచారణకు పిలవడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భగ్గుమన్నారు. ‘తెలంగాణ సాధకుడైన, స్వరాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయిన కేసీఆర్‌పై కక్షసాధించాలని చూస్తున్న రేవంత్‌రెడ్డీ.. ఖబడ్దార్..’ అంటూ హెచ్చరించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను ఉల్లంఘిస్తూ కేసీఆర్‌ను విచారణకు పిలవడాన్ని ఖండిస్తూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మం, వైరాల్లో రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది.
ఈ సందర్భంగా ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డులో నిర్వహించిన రాస్తారోకోలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. అజయ్‌కుమార్‌ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో సమీపంలో ఉన్న వన్‌టౌన్ సీఐ కరుణాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
దీంతో సీఐని హుటాహుటిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును పోలీసులు టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పెద్దతండాలో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. సత్తుపల్లిలోనూ బీఆర్ఎస్ నేతలు భారీ నిరసన ర్యాలీని, రాస్తారోకోను చేశారు. దమ్మపేటలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైరాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
మధిరలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, రాస్తారోకో చేశారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. మణుగూరులో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు రాస్తారోకో చేశారు. ఆయనతో సహా గులాబీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేశారు. భద్రాచలంలో బీఆర్ఎస్ నాయకులు మోటార్ సైకిళ్ల ప్రదర్శన నిర్వహించి రాస్తారోకో చేశారు.
కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను భుజానికెత్తుకొని, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పెట్టిన మా గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. ఫోన్ ట్యాపింగ్ పేరుతో సిట్ అధికారులు కేసీఆర్ ఇంటి గోడకు నోటీసులు అంటించి విచారణకు పిలవడం సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలకు విరుద్ధం. -పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి
తెలంగాణను తెచ్చిన నాయకుడు మా పెద్దాయన. ఆయనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తే సహించేదిలేదు. ఈగ వాలినా ఊరుకోం. అధికార బలం, అక్రమ కేసులతో బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను ఎదుర్కోలేరు. కేసీఆర్ అంటే ఒక శక్తి. ఆయన్ని ఎవరూ కదపలేరు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్నికల్లో సత్తాచాటుతాం. మేమేంటో ప్రజాక్షేత్రంలోనూ చూపిస్తాం.
-వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
కేసీఆర్‌పైనా, బీఆర్ఎస్పైనా ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను చేసి కాంగ్రెస్ సర్కారు భయపడుతోంది. అందుకనే కేసీఆర్ చరిష్మాను దెబ్బతీసేందుకు సీఎం రేవంత్ చేసిన కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసును బయటకు తెచ్చారు. సిట్ విచారణ పేరుతో కేసీఆర్‌పై నిందలు మోపాలని చూస్తున్నారు. ఇవన్నీ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్సే.
-తాతా మధు, ఎమ్మెల్సీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాటాకు చప్పళ్లుకు భయపడం. ఎన్ని కేసులు పెట్టినా, నిర్బంధాలు చేసినా బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోలేరు. జనమంతా కేసీఆర్‌వైపే ఉన్నారు. పంచాయతీల్లో కాంగ్రెస్ పాలకులు గెలవలేకపోయారు. బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్ అవినీతిని బీఆర్ఎస్ బయటపెడుతుండడంతో ఫోన్ ట్యాపింగ్ కేసును బయటకు తెచ్చారు.
-రేగా కాంతారావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు

విచారణ కోసం హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలోకి వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

పెద్దతండాలో ర్యాలీగా వెళ్తున్న తాతా మధు, కందాల

మణుగూరులో రాస్తారోకో చేస్తున్న రేగా కాంతారావు, నేతలు

ఇల్లెందులో ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ

కల్లూరులో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేత దిండిగాల రాజేందర్, చిత్రంలో బీఆర్ఎస్ నాయకులు

కూసుమంచిలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

ఖమ్మంలో భారీ బైక్ ర్యాలీగా వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు, చిత్రంలో మాజీ మంత్రి అజయ్‌కుమార్