దామరచర్ల, ఆగస్టు 3 : ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్వాసితులు హెచ్చరించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రం సమీపంలో నిర్మించిన వైటీపీఎస్‌కు భూములిచ్చిన 8 గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఉద్యోగాల కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో ఆందోళనబాటపట్టారు. మండలంలోని వీర్లపాలెం, తాళ్లవీరప్ప గూడెం, సాత్ తండా, దుబ్బ తండా, నర్సాపురం, తిమ్మాపురం, శాంతినగర్ గ్రామాలకు చెందిన 270 మంది తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్‌ప్లాంటు ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా తాళ్లవీరప్ప గూడెం నుంచి ర్యాలీగా వైటీపీఎస్‌కు చేరుకున్నారు. లోపలికి వెళ్తున్న కార్మికులను నిర్వాసితులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు జోక్యం చేసుకోవడంతో ప్లాంట్ ఎదుటే ప్లకార్డులతో బైఠాయించారు.