సభా వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు తాతా మధు, కౌశిక్‌రెడ్డి, బాలమల్లు, ఎంపీ నామా తదితరులు
ఖమ్మం, జనవరి 17 : ఖమ్మం నగరం.. గులాబీమయమైంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ బుధవారం జరుగనున్న భారీ బహిరంగ సభతో కొత్త శోభను సంతరించుకున్నది. ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఇలాంటి గొప్ప బహిరంగ సభను నిర్వహించిన రాజకీయ పార్టీలు ఇంతవరకు లేవని పలువురు పేర్కొంటున్నారు. లక్షలాది మంది ప్రజలు పాల్గొనే బహిరంగ సభకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజుల్లోనే ఖమ్మం గులాబీమయంగా మారింది. ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఈ నెల 8న తలపెట్టారు. ఆ వెంటనే రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు సభా ఏర్పాట్ల బాధ్యతను ఇవ్వడంతో ఒక్కసారిగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ శ్రేణుల్లో చలనం మొదలైంది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలతోపాటు సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలను నిర్వహించింది. లక్షలాది మంది ప్రజలు తరలిరావాలని పార్టీ ముఖ్యనేతలు పిలుపునిచ్చారు.
అద్భుతంగా నగరం ముస్తాబు..
కనీవిని ఎరుగని రీతిలో ఖమ్మం నగరం భారీ బహిరంగ సభకు ముస్తాబైంది. సీఎం కేసీఆర్, ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రివాల్, భగవంత్‌మాన్, పినరాయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాముల్‌నాయక్, హరిప్రియానాయక్ పలువురు బీఆర్ఎస్ నాయకుల ఫొటోలతో నగరంలోని ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసిన కటౌట్లు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గుండ్రటి ఆకృతిలో ఏర్పాటు చేసిన కటౌట్ల మధ్యలో నాయకుల ఫొటోలు అందంగా ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి.
ముఖ్యంగా కాల్వొడ్డు నుంచి రాపర్తిగనర్ బైపాస్‌రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు పెద్ద పెద్ద కటౌట్లలో దేశానికి సంబంధించిన కొటేషన్లతో ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ రాకతో దేశ ముఖచిత్రం మారుతున్నదనే కొటేషన్లు ప్రజలు నిలబడి చదువుతున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతమైన నాయకన్‌గూడెం నుంచి కూసుమంచి ఖమ్మం రూరల్‌లోని వరంగల్ క్రాస్‌రోడ్డు, కరుణగిరి చర్చి వైపున కూడా కటౌట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇల్లెందు రోడ్డు వైపు పండితాపురం నుంచి పాండురంగాపురం, బల్లేపల్లి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సత్తుపల్లి, కల్లూరు, వైరా, కొణిజర్ల, తణికెళ్ల సెంటర్లలో, మధిర, బోనకల్లు, చింతకాని కేంద్రాల్లో ఈ కటౌట్లను ఏర్పాటు చేశారు.
నగరంలో సందడే.. సందడి
వారంరోజుల నుంచి ఖమ్మం నగరంలో సందడి నెలకొన్నది. ఏ రోడ్డుకు చూసినా బీఆర్ఎస్ ఫ్లెక్సీ కటౌట్లే దర్శనమిస్తున్నాయి. కాల్వొడ్డు, జాబ్లీక్లబ్, గాంధీచౌక్, మార్కెట్ ఏరియా, మయూరి సెంటర్, బస్‌డిపో రోడ్డు, వైరా రోడ్డు, జడ్పీ సెంటర్, చర్చి కాంపౌండ్ సెంటర్, ముస్తాఫనగర్, బోనకల్ రోడ్డు, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, మమత రోడ్డు, రోటరీనగర్ ప్రాంతాలు బీఆర్ఎస్ ఖమ్మం నాయకుల ఫ్లెక్సీలు, తోరణాలతో గులాబీమయమయ్యాయి. నలుగురు కూడిన చోటల్లా బీఆర్ఎస్ సభ గురించే చర్చించుకుంటున్నారు. కనీవీని ఎరుగని రీతిలో ఖమ్మం నగరంలో ప్రచారం జరగడంతో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఖమ్మం సభకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలు, మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు సభకు హాజరుకానున్నాయి.
అబ్బురపరుస్తున్న ఏర్పాట్లు
దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించేలా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభా వేదిక ముస్తాబైంది. సభా ఏర్పాట్లు అబ్బురపరుస్తున్నాయి. వంద ఎకరాల సువిశాల స్థలంలో లక్షమంది కూర్చునే విధంగా కూర్చీలను ఏర్పాటు చేశారు. 15వేల మంది వీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేక గ్యాలరీలు.. ప్రజలు సభను వీక్షించేందుకు 50ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాల నుంచి సభకు వచ్చే వాహనాల పార్కింగ్‌కు 400 ఎకరాలు.. వెయ్యి మందికి పైగా వలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. ఏర్పాట్లను సభ ఇన్చార్జి, మంత్రి హరీశ్‌రావు, మంత్రి పువ్వాడ పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోనే 20 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్‌కు సంబంధించిన వాహనాల పాస్‌లను ఆయా నియోజకవర్గాల బాధ్యులకు ఇప్పటికే పంపించారు.