ఖమ్మంసిటీ, ఏప్రిల్ 18 : గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాలి.. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నదే లక్ష్యంగా.. సరిగ్గా పదేండ్ల క్రితం ఖమ్మంలో జరిగిన ప్లీనరీ స్ఫూర్తిగా.. ఆ పార్టీ మరోసారి ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టింది. ఖమ్మం నగరంలోని మమత ఆసుపత్రి ప్రాంగణంలో ఫుట్‌బాల్ స్టేడి యం వేదికగా.. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు అంగరంగ వైభవంగా వేడుకలు ప్రారంభంకానున్నాయి. వేలాదిమందితో భారీ బహిరంగ సభ జరుగనుంది. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు విచ్చేస్తుండగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సారధ్యంలో విస్తృ త ఏర్పాట్లు చేస్తున్నారు.
వీరితోపాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖ మ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు తదితర మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ, ఏఎంసీ మాజీ చైర్మన్లు, ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఖమ్మంలోని కార్పొరేటర్లు, ముఖ్యనాయకులను సభావేదిక మీదకు ఆహ్వానించనున్నారు. వారంతా ఆశీనులయ్యే విధంగా ‘మమత’ స్టేడియంలో వేదికను రూపొందించారు.
సరిగ్గా రెండున్నర సంవత్సరాల తర్వాత జరుగబోతున్న ఆత్మీయ సమ్మేళనానికి గులాబీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశానుసారం వేడుక విజయవంతానికి గత పదిరోజుల ముందు నుంచి సమావేశాలు నిర్వహించారు. వాడవాడల్లో పర్యటిస్తూ ఖమ్మం నగరంలోని 60 డివిజన్లు, రఘునాథపాలెం మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు ఆహ్వానం పంపారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న నేతలు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
ఖమ్మం అసెంబ్లీ పరిధి నుంచి దాదాపు పది వేల మందికి తగ్గకుండా జనాలు వస్తారని నాయకులు అంచనా వేస్తున్నారు. కాగా..! సభకు వచ్చే వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీ కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుత వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వలంటీర్లను నియమించి ఎప్పటికప్పుడు మంచినీళ్లు అందించనున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ కళాకారులు, ప్రజా గాయకులు వస్తుండటంతో ధూంధాం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తనున్నాయి. చివరగా కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఘనంగా సన్మానించనున్నారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మరో అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. గులాబీ పార్టీకి చెందిన నేతల సమక్షంలో, ప్రజల నినాదాల నడుమ మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జన్మదిన వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. యాభై తొమ్మిదేండ్లు పూర్తిచేసుకుని, అరవయ్యో ఏటలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నరు. సభా వేదిక మీదనే కేక్ కటింగ్, వేలాదిగా తరలివచ్చిన జనాలతో కలిసి విందు భోజనం చేయనున్నారు.
దీనికిగాను మంచి రుచికరమైన వంటలు తయారు చేయిస్తుండటం గమనార్హం. పార్టీ యువజన విభా గం ఆధ్వర్యంలో పలురకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేయనున్నారు. కాగా.. నగరంలోని అన్ని ప్రధాన సెంటర్లు, హోర్డింగ్‌లు ఇప్పటికే మినీ ప్లీనరీ, పువ్వాడ జన్మదిన వేడుకల ప్లెక్సీలతో నిండిపోయాయి. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ గుండాల కృష్ణ, సీనియర్ నాయకులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, అజయ్ వ్యక్తిగత సహాయకుడు కిరణ్, మందడపు రామకృష్ణ, కార్పొరేటర్లు బిక్కసాని జస్వంత్, మగ్బుల్, దేవభక్తిని కిషోర్‌కుమార్ తదితరులు ప్లీనరీ, సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.