పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండ్రోజులపాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర, రోడ్ షో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సూపర్ సక్సెస్ అయ్యింది. మంగళవారం రాత్రి కొత్తగూడెంలో రోడ్ షో ముగిసిన తర్వాత అక్కడే బస చేసిన కేసీఆర్.. బుధవారం సాయంత్రం కొత్తగూడెం నుంచి మహబూబాబాద్ జిల్లాకు బస్సుయాత్ర ద్వారా బయలుదేరారు. యాత్ర షురువైనప్పటి నుంచి తమ ప్రాంతానికి అభిమాన నాయకుడు ఎప్పుడొస్తారా.. అని ఎదురుచూసిన ప్రజలు కేసీఆర్‌కు ఎదురేగి బ్రహ్మరథం పట్టారు.
గులాబీ జెండాలు ఊపుతూ.. రంగు కాగితాలు, పూలు చల్లూతూ సంబురం చేశారు. కేసీఆర్‌కు మహిళలు మంగళహారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. ప్రతిగా కేసీఆర్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జన నీరాజనాల మధ్య కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డు నుంచి బొమ్మనపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, గంధంపల్లి, కొత్తపేట, బయ్యారం మీదుగా కేసీఆర్ బస్సు యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరింది.
భద్రాద్రి కొత్తగూడెం, మే 1 (నమస్తే తెలంగాణ) : ఉద్యమనేత, గులాబీ దళపతి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సుయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సూపర్ సక్సెస్ అయ్యింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న ఆయనకు గులాబీ అభిమానులు నీరాజనాలు పలికారు. దూరప్రాంతాల నుంచి జనం కొత్తగూడెం పట్టణం వచ్చి రోడ్ షోను విజయవంతం చేశారు. ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.
జనసంద్రంగా మారిన రోడ్ షో ద్వారా కేసీఆర్ ఒక అంచనాకు వచ్చారు. ముఖ్య నాయకులతో మంగళవారం రాత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. కొత్తగూడెం సింగరేణి అతిథి గృహంలో రాత్రి బసచేసిన కేసీఆర్‌ను బుధవారం కలిసేందుకు జనం బారులుదీరారు. కేసీఆర్‌ను చూడాలని భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. సింగరేణి గెస్ట్‌హౌస్ అభిమానులతో సందడిగా మారింది. ఇల్లెందు క్రాస్‌రోడ్ నుంచి పాల్వంచ వరకు వాహనాలతో రహదారి అంతా బిజీగా మారింది.
కొత్తగూడెంలో బస చేసిన కేసీఆర్‌ను మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పాల్వంచలోని తన ఇంటికి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం బస్సులో కేసీఆర్ పాల్వంచకు వెళ్లారు. కేసీఆర్‌కు మాజీ మంత్రి వనమా కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. వనమా ఇంట్లో తేనేటి విందును స్వీకరించిన కేసీఆర్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మళ్లీ బస్సులో మహబూబాబాద్‌కు పయనమయ్యారు. ఇల్లెందు క్రాస్‌రోడ్డు మీదుగా టేకులపల్లి, ఇల్లెందు మీదుగా బస్సు యాత్ర కొనసాగింది.
ఈ పర్యటనలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, సండ్ర వెంకటవీరయ్య, భద్రాచలం ఇన్‌ఛార్జి మానె రామకృష్ణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.