భద్రాచలం, నవంబర్ 1: కార్తీక మాసం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ఆలయమైన అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం (శివాలయం)లో శనివారం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. భద్రాచలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్తీక మాస పూజా కార్యక్రమాల వివరాలను ఆమె వెల్లడించారు.
కార్తీక మాసంలో నాలుగు 4, 11, 18, 25 సోమవారాల్లో విశేష పూజలు ఉంటాయని, 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, 17న స్వామివారి కల్యాణం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇక్కడి ఉమారామలింగేశ్వరస్వామి, అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాలు 400 ఏళ్ల క్రితం నిర్మించడంతోపాటు మహిమానిత్వమైనవని, కార్తీక మాస పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
27న గోదావరి నదీహారతి ఉంటుందని, ఇక్కడ స్వామివారి పాదుకలతో పూజలు చేస్తారని తెలిపారు. మహిళా భక్తులు అత్యధిక సంఖ్యలో తరలిరానున్నందున ఆలయం వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, కార్తీకమాసంలో ఉదయం, సాయంత్రం ప్రసాదాలు అందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఆలయ అర్చకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.