కారేపల్లి,ఫిబ్రవరి 19: ఖమ్మం జిల్లా కారేపల్లి(Karepalli) మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే సహించేది లేదని కారేపల్లి గ్రామస్తులు తెగేసి చెప్పారు. స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం పక్కన ఉన్న సర్వేనెంబర్ 38లో గల(బీసీ వసతి గృహానికి కేటాయించిన)ప్రభుత్వ స్థలంలో బుధవారం గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతి ఉత్సవాలను స్థానిక బంజారా నాయకులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కారేపల్లి గ్రామానికి చెందిన కుల పెద్దలు అంతా అక్కడికి చేరుకొన్నారు. ఇది ప్రభుత్వ స్థలమని ఇక్కడ ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దని సేవాలాల్ జయంతి ఉత్సవ నిర్వాహకులకు సూచించారు.
అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆ స్థలాన్ని ప్రభుత్వం బీసీ, ఎస్టీ, ఎస్సీ హాస్టల్ వసతి గృహాలను నిర్మించేందుకు కేటాయించిందన్నారు. ఇప్పటికే కారేపల్లి మండలం కేంద్రంలో ఉన్నకొద్ది ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఈ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
ఈ విషయమై ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను వివరించి వినతి పత్రాలు అందజేసినట్లు వారు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాల పెద్దలు తురక నారాయణ, రాంబాబు, తురక రాంబాబు, కేతిమల్ల శ్రీనివాసరావు, పోతు నరసయ్య, మామిళ్ల శీను, మేకల మల్లయ్య, ఇమ్మడి సీతారాములు, పాలిక కోటేశ్వరావు, చెవుల లక్ష్మీనారాయణ, ఆరెల్లి శ్రీరాములు, తోకల సాయి గడ్డం దిలీప్, ఏర్నాగి ముత్తయ్య, పోకల లింగయ్య, జగ్గాని రాజు, ఇదిగాని ఉపేందర్, సారయ్య, సన్నీ, మేకల సతీష్, గోపి, వెంకన్న, రాంబాబు, అశోక్ కుమార్, రమేష్, బసవకుమార్, నరసింహారావు, ప్రభాకర్, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.