మామిళ్లగూడెం, జనవరి 4 : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్ సూచించారు. బుధవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో విద్యుత్, గ్రామీణాభివృద్ధి, విద్య, కంటి వెలుగు కార్యక్రమాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు నిర్వహణకు జిల్లాలో 55 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చేనెల 18 న ప్రారంభమవుతుందని, 100 రోజుల పనిదినాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ గ్రామీణ ప్రాంతాల్లో 300, పట్టణ ప్రాంతాల్లో 400 మందికి స్రీనింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఏ గ్రామంలో ఏ ప్రదేశంలో ఏ రోజు కంటి వెలుగు శిబిరం నిర్వహించేది ముందస్తుగా ప్రజలకు టాంటాం ద్వారా ప్రచారం కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
గ్రామాల్లో రోడ్ల మధ్యలో స్తంభాలు వస్తున్నాయని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా టీఎస్ఎన్పీడీసీఎల్ ఎస్ఈకి సూచించారు. వైకుంఠధామాల్లో విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తొలిమెట్టును సమర్థవంతంగా అమలు చేసి, విద్యాపరంగా జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచే బృహత్తర కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి 81.16 లక్షల పని దినాలతో రూ.347.37 కోట్లతో లేబర్ బడ్జెట్‌ను తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖ లక్ష్యంగా ఇచ్చినట్లు తెలిపారు.
డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు మాట్లాడుతూ కంటి వెలుగు మంచి కార్యక్రమమని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
అధికారుల పనితీరుపై అసంతృప్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు, నిర్వహణలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై జడ్పీచైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా మైదాన ప్రాంత రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలనున సంరక్షించడంలో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈవో సోమశేఖర్‌శర్మ ప్రగతి నివేదిక చదివిన తర్వాత జడ్పీటీసీలు విద్యాశాఖలో జరుగుతున్న లోపాలపై డీఈవోను ప్రశ్నించారు.
పీఆర్ జాతీయ వర్క్‌షాపునకు జడ్పీ చైర్మన్
మామిళ్లగూడెం, జనవరి 4: కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వ ర్యంలో దేశంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి కోసం అభివృద్ధి ప్రణాళికపై ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ వర్క్‌షాపునకు ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు హాజరుకానున్నారు. ఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేదర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ జాతీయ వర్షాపునకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా ఆయన హాజరుకానున్నారు.
రాష్ట్రంలోని అందరు జడ్పీ చైర్మన్ల తరఫున ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజును రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంపిక చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందుకున్న ఆయన బుధవారం సాయంత్రం పలువురు అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా హాజరు కానున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో జరుగుతున్న గ్రామాల అభివృద్ధిపై ఈ వర్షాపులో చైర్మన్ మాట్లాడనున్నారు.