ఖమ్మంరూరల్, ఫిబ్రవరి 8 : బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తిలేదని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీలో 18, 19వ వార్డుల పరిధిలోని బారుగూడెం, శ్రీసిటీ, గుర్రాలపాడులో సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు.
నాయకులకు ఆయా వార్డుల ప్రజలు ఘనస్వాగతం పలికారు. కూడళ్లలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సభల్లో వారు మాట్లాడారు. వ్యాపారం చేసేందుకు వచ్చేవారు వ్యాపారాలే చేసుకోవాలని, ఎదుటి పార్టీ కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పైసా పైసా కూడబెట్టి ఇండ్ల స్థలాలు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నవారు వారికి కట్టుబానిసలుకారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇండ్లకు, అపార్టుమెంట్లకు రాకుండా చేయడం పిరికింద చర్యగా అభివర్ణించారు. ఎన్నికల ముందు వరకు మనవెంటే ఉండి తీరా నామినేషన్ల సమయంలో మోసంచేసిన వారికి కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు.
సీపీఎం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోపాటు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయంతో మెలిగి పొన్నెకంటి బాలమ్మ, బొల్లం నాగయ్యను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏదులాపురం కొద్దిరోజుల్లో గులాబీపురం కాబోతుందన్నారు. బీఆర్ఎస్, సీపీఎం కూటమికి స్పష్టమైన మెజార్టీతో పాలకవర్గం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి వార్డును అభివృద్ధి చేసే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.