మణుగూరు టౌన్, ఏప్రిల్ 21: ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మరోసారి బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 420 హామీలను నమ్మి ఓటేసిన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
ఇప్పుడు ప్రజల మనసుల్లో బీఆరెస్సే ఉందని స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం మణుగూరుకు వచ్చిన ఆమెకు బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఘన స్వాగతం పలికారు. అనంతరం మణుగూరులోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జెండాను కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 27న రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు, పార్టీకి మధ్య బలమైన అనుబంధం ఉండాలని సూచించారు. అనంతరం ఉద్యమకారుడు పవన్నాయక్ ప్రతాప్ ఏర్పాటుచేసిన తేనీటి విందును స్వీకరించారు. తరువాత మణుగూరులోని ఎక్స్లెంట్ విద్యాసంస్థల చైర్మన్ యూసుఫ్ నివాసంలో పార్టీ నేతలతో కలిసి భోజనం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.