భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ సారపాక/ కొత్తగూడెం అర్బన్/ ముదిగొండ/ కూసుమంచి రూరల్/ ఖమ్మం రూరల్, మే 3: తమకు అదనపు వేతనాల పెంపు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమైందని పారిశుధ్య కార్మికులు పేర్కొన్నారు. తమపై ఆయన చూపిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మర్చిపోలేమని, ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు. మే 1న ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు రూ.వెయ్యి అదనపు వేతనాన్ని పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో పారిశుధ్య కార్మికులు బుధవారం సంబురాలు నిర్వహించారు.
సారపాకలో..
సఫాయి కార్మికులకు రూ.వెయ్యి వేతనం పెంపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సారపాకలో బస్టాండ్ సెంటర్లో సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగా చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్మిక విభాగం నాయకులు గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం శ్రీనివాసరావు, కొనకంచి బసంతిదేవి, మర్రి సాంబిరెడ్డి, కొనకంచి శ్రీనివాసరావు, తిరుపతి ఏసోబు, బాలి శ్రీహరి, చుక్కపల్లి బాలాజీ, సానికొమ్ము శంకర్‌రెడ్డి, ఆంజనేయులు, సూదిపాక ఈశ్వర్, కనుకు వెంకటేశ్వర్లు, పంగి సురేశ్, భూక్యా కృష్ణ, మూడ్ మణికంఠ, జినుగు దాసు, కృష్ణకుమార్, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలో..
కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయంలోనూ సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఫ్లెక్సీతోపాటు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే వనమా ఫ్లెక్సీలకు కూడా పారిశుధ్య కార్మికులు క్షీరాభిషేకం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మికి స్వీట్లు తినిపించారు. శాలువా కప్పి సత్కరించారు.
గీత కార్మికుల హర్షం..
ప్రమాద బీమా పథకం వర్తింపు పట్ల కల్లు గీత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు గడ్డం వెంకటిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కల్లు గీత కార్మికులకు బీమా వర్తింపు పట్ల బీఆర్ఎస్ కూసుమంచి మండల నాయకులు చాట్ల పరుశురాం, షేక్ అలీ, రాయబారపు రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలోనూ కల్లుగీత కార్మికులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నాయకులు కొండం కృష్ణయ్య, సంగయ్య, శ్యామకూరి రంగయ్య, తాళ్లపల్లి సత్యనారాయణ, పరికపల్లి సుదర్శన్, గడ్డమీద వెంకటయ్య, చింతకింద సత్యనారాయణ, తొండల రాములు, మొక్క ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసినందుకు..
భద్రాద్రి జిల్లాలోని 19 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 21 మంది ఫార్మాసిస్టులు, 42 మంది హెల్త్ అసిస్టెంట్లను ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసినందుకు టీఎంఎల్టీఏ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కొత్తగూడెం కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అసోసియేషన్ నాయకులు బీ.లాలు, గొంది వెంకటేశ్వర్లు, ఫయాజ్జీన్, నగేశ్, కుమారస్వామి, హరికృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.