కొత్తగూడెం టౌన్, జూన్ 8 : కక్షిదారులకు సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నామని, జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లావ్యాప్తంగా 5,454 కేసులు పరిష్కారమయ్యాయని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. 12 మోటార్ వాహన ప్రమాద కేసుల్లో బాధితులకు రూ.22,45,000 చెల్లించే విధంగా పరిష్కారం లభించిందని, క్రిమినల్ 3,362, సివిల్ 17, పీఎల్సీ కేసులు 98 పరిష్కారమయ్యాయని తెలిపారు.
కొత్తగూడెంలో 3,379 కేసులు, ఇల్లెందులో సివిల్ కేసు 1, క్రిమినల్ కేసులు 452, పీఎల్సీ కేసులు 27, మొత్తం పరిష్కారమైన కేసులు 453, భద్రాచలంలో క్రిమినల్ కేసులు 1,078, బ్యాంకు కేసులు 40.. మొత్తం పరిష్కారమైన కేసులు 1,118, మణుగూరులో క్రిమినల్ కేసులు 379 పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. కాగా.. భద్రాద్రి కొత్తగూడెం ఎస్బీఐ వారి సౌజన్యంతో కక్షిదారులకు పులిహోర, మంచినీటి సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితోపాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భానుమతి, జడ్జీలు రామారావు, సాయిశ్రీ, శివనాయక్, డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.