మాటిమాటికీ మాటలు మారుస్తూ నోటికొచ్చిన గడువులు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు మండిపడుతున్నారు. రైతుభరోసా విషయంలో పూటకో మాట చెబుతూ రోజురోజుకూ తమకు ఆశలు కల్పించేలా ప్రకటనలు చేస్తూ తమ భావోద్వేగాలతో ఆటలాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇస్తామంటూ నమ్మబలికిన ప్రభుత్వం.. ఏడాది దాటినా ఆ సాయాన్ని ఇవ్వడం లేదు. పైగా రూ.12 వేలకు కుదించి గడువులు పెడుతూ కాలం గడుపుతోంది.
ఇప్పటికే డిసెంబర్ 9, సంక్రాంతి, రిపబ్లిక్ డే అంటూ తేదీలు ప్రకటించిన ప్రభుత్వం వీటిల్లో ఏ తేదీలోనూ ఇచ్చిన మాట ప్రకారం రైతుభరోసా ఇవ్వలేదు. పైగా మొన్నటికి మొన్న నారాయణపేట జిల్లా సభలో 17 నిమిషాల వ్యవధిలోనే సాక్షాత్తూ ముఖ్యమంత్రే మాట మార్చారు. తొలుత జనవరి 26నే జమ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొద్దిసేపటి తరువాత 31లోపు జమ చేస్తామంటూ గడువు పెంచారు. దీంతో రైతులందరూ నిశ్చేష్టులయ్యారు. సభావేదిక సాక్షిగా మళ్లీ గడువు పొడిగించడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆ తరువాత ఆ గడువునూ మార్చారు.
అలాగే, పథకాల మంజూరు పత్రాల పంపిణీకి మండలానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేశారు. రిపబ్లిక్ డే నాడు ఆ గ్రామాల్లో ఇటీవలి నాలుగు పథకాలకు ఎంపికైన అర్హులకు పత్రాలు అందించారు. ఇదే క్రమంలో ఈ పైలట్ గ్రామంలోని రైతులకు మాత్రమే సోమవారం రైతుభరోసా పంటల పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. కానీ ముఖ్యమంత్రి మాటలను విశ్వసించిన ఉమ్మడి జిల్లా రైతులు సోమవారం ఉదయం నుంచి రాత్రి దాకా రోజుంతా సెల్ఫోన్లలోకి చేస్తూ.. రైతుభరోసా సాయం జమ అవుతుందేమోననే ఆశతో ఎదురుచూశారు. అర్ధరాత్రి దాటినా రైతుభరోసా సందేశం రాకపోవడంతో ముఖ్యమంత్రిని తిట్టుకుంటూ నిట్టూర్చారు.
– ఖమ్మం వ్యవసాయం, జనవరి 27
పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకూ కాకుండా కేవలం ఎంపిక చేసిన గ్రామాల రైతులకు మాత్రమే మొదటి రోజున రైతుభరోసా సాయం జమ అయింది. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు అర్హుల ఎంపిక కోసం ఈ నెల 21 నుంచి 24 వరకూ గ్రామసభలు నిర్వహించిన విషయం విదితమే. వాటిల్లో అర్హత సాధించిన లబ్ధిదారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న ఆయా పథకాల లబ్ధిని పంపిణీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించి ఉంది. కానీ ఆ గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా లేకపోవడం, జాబితా నిండా అనర్హుల పేర్లే ఉండడంతో అర్హుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
చివరికి అర్హుల జాబితాలో తమ పేర్లు రాలేదంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయా పథకాల దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో పథకాల జాబితాలో పేర్లు రాని అర్హులు అదే గ్రామసభల్లో మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో దరఖాస్తులు అధికంగా రావడంతో అప్పటికప్పుడు వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేయడం సాధ్యం కాదని ప్రకటించిన ప్రభుత్వం.. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, పథకాలు పంపిణీ వంటి ప్రక్రియల కోసం మార్చి 31 వరకూ గడువు పెంచింది.
కానీ తొలుత ఇచ్చిన మాట ప్రకారం.. రిపబ్లిక్ రోజున పథకాలు పంపిణీ చేయాల్సి ఉన్నందున మండలానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసింది. ఆ గ్రామంలోని అర్హులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల మంజూరు పత్రాలను అందజేసింది. కానీ రిపబ్లిక్‌డే ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉన్నందున రైతుభరోసాను అదే రోజు అర్ధరాత్రి తరువాత జమచేస్తామంటూ నారాయణపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఎకరానికి రూ.6 వేల చొప్పున తొలి విడత సాయం జమ చేస్తామని, జనవరి 26న అర్ధరాత్రి 12 గంటల తరువాత రైతుభరోసా సాయం జమ అవగానే రైతుల ఫోన్లన్నీ ‘టింగ్.. టింగ్..’ అంటూ మెసేజీలతో మోగుతాయని, రైతులందరూ ఆ మెసేజీలను నిర్ధారించుకొని పంటల సాయన్ని అందుకోవాలని సూచించారు. కానీ మరుసటి రోజైన జనవరి 27న రాత్రి వరకూ చూసినా జిల్లాలోని రైతులెవరికీ రైతుభరోసా నిధులు జమ కాలేదు. కేవలం ఎంపిక చేసిన పైలట్ గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో మాత్రమే సోమవారం సాయంత్రం రైతుభరోసా నిధులు జమ అయ్యాయి.
రైతుబంధు విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానానికి భిన్నంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తొలుత ఎకరంలోపు, ఎకరం సాగుభూమి ఉన్న రైతుల నుంచి మొదలుపెట్టి.. ఆఖరుకు అధిక విస్తీర్ణంలో సాగుభూమి ఉన్న రైతుల వరకూ రైతుబంధును జమ చేసేది గత కేసీఆర్ ప్రభుత్వం. కానీ, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం ఒక్కో మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసి అక్కడి రైతులకు మాత్రమే రైతుభరోసాను జమ చేసింది.
ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లోని 21 పైలట్ గ్రామాల రైతులకు మాత్రమే సోమవారం రైతుభరోసాన జమ చేసింది. ఖమ్మం జిల్లాలోని 21 గ్రామాలకు చెందిన 20,802 మంది రైతుల ఖాతాల్లో రూ.28.42 కోట్లు జమ అయినట్లు అధికారులు ప్రకటించారు. కానీ, ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఇదే రైతుభరోసా సాయం తమ ఖాతాల్లోనూ జమ అవుతుందని భావించిన జిల్లా రైతులు సోమవారం నుంచి రాత్రి వరకూ ఎదురుచూశారు. చివరికి తీవ్ర నిరాశతో నిట్టూర్చారు. ఇరుగుపొరుగు రైతులను పలుకరించి సమాచారం తెలుసుకున్నారు. వారికేమైనా సాయం జమ అయిందేమోనని ఆరా తీశారు. ఎవరికీ జమ కాలేదని తెలుసుకొని నిస్సహాయత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలూ నమ్మేలా లేవని ఈసడించుకున్నారు.
ఖమ్మం జిల్లాలో ఎకరానికి రూ.6 వేల చొప్పున తొలిరోజున కేవలం 20 వేల మందికే సాయం అందింది. కానీ, మిగిలిన గ్రామాల రైతులకు పంటల పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందోననే అంశంపై స్పష్టత కరువైంది. తమకు సాయం జమ చేసే అంశంపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారుల గణంకాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మంది రైతులు 7.41 లక్షల ఎకరాల సాగుభూమి కలిగి ఉన్నారు. ప్రస్తుతం కేవలం 20 వేల మందికి మాత్రమే సాయం అందింది. అంటే మొత్తం రైతుల్లో కనీసం పది శాతం మందికి కూడా సాయం అందలేదు.
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 27 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలోనూ కేవలం 22,125 మంది రైతులకు మాత్రమే సోమవారం రైతుభరోసా అందింది. జిల్లాలో రైతుభరోసా కోసం 1,87,597 మంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారు. వీరిలో కేవలం 22,125 మంది రైతులకు చెందిన 64,853 ఎకరాలకు గాను రూ.39 కోట్లు జమ అయ్యాయి. అది కూడా కేవలం పది ఎకరాల్లోపు ఉన్న వాళ్లకే జమ అయినట్లు రైతులు చెబుతున్నారు. 1.23 లక్షల మంది రైతులకు రూ.335 కోట్లు జమ కావాల్సి ఉంది. కాగా, అధికారులు ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించి 2,800 ఎకరాలను లేఅవుట్లు చేసినట్లు గుర్తించారు.
జిల్లాలో అర్హులైన రైతులందరికీ రైతుభరోసా వస్తుంది. ఇటీవలి సర్వే ప్రకారం జిల్లాలో 1,87,597 మంది రైతులు ఉన్నారు. జిల్లాలో ఉన్న సాగు భూముల్లో 2,800 ఎకరాలను లేఅవుట్లు చేసినట్లు గుర్తించాం. ఈ 2,800 ఎకరాలకు రైతుభరోసా రాదు. మిగిలిన అందరికీ రైతుభరోసా అందుతుంది.
-బాబూరావు, డీఏవో, భద్రాద్రి కొత్తగూడెం