ఖమ్మం, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్కు దూరంగా ఉంటూ జూలైలో తన ప్రధాన అనుచరులతో కలిసి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత, టీపీసీసీ ప్రచార విభాగ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే. పొంగులేటి అనుచరుడిగా తెల్లం వెంకట్రావ్‌కు మొదటి నుంచి గుర్తింపు ఉంది. పొంగులేటితో నిన్నమొన్నటివరకు కలిసి నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తెల్లం వెంకట్రావ్ అంతర్గత విభేదాలతో ఆ పార్టీని వీడనున్నారు. తిరిగి ఆయన బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంకట్రావు చేరిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమక్షంలో వెంకట్రావ్, ఆయన అనుచరులు పార్టీలో చేరనున్నారు. తెల్లంతోపాటు దుమ్ముగూడెం జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఇతర మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులూ బీఆర్ఎస్లో చేరనున్నారు.
తెల్లం వెంకట్రావు 2014లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆయన అనంతరం బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ భద్రాచలం భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కొన్నినెలల నుంచి పొంగులేటితో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి అక్కడి నేతల వ్యవహారశైలితో తెల్లం ఇబ్బందిపడ్డారని తెలుస్తున్నది. తన రాజకీయ భవిష్యత్తుపై పొంగులేటి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, పార్టీ వ్యవహారాల్లో తనకు స్థానం కల్పించకపోవడం, పార్టీ ఒంటెద్దుపోకడలు అనుసరించడం వంటి కారణాలతో తెల్లం వెంకట్రావు పార్టీని వీడుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరిన కొద్దిరోజుల్లోనే పొంగులేటి ముఖ్యఅనుచరుడు పార్టీని వీడడం ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశమైంది. తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీని వీడడం పొంగులేటికి అపప్రధ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత కాలం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. సీనియర్ నేతగా ఉన్న తనకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదని ఆయన తన అనుచరుల వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న తాటి బీఆర్ఎస్ పార్టీలో చేరే విషయంపై తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య సైతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లుగా ప్రచారం జరుగుతుండగా.. పార్టీలోకి వస్తే తనకు సముచిత స్థానం కల్పించాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోరం కనకయ్య మాత్రం రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ… తనకు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవమానాలు, ఇబ్బందులపై తనను నమ్ముకున్న కార్యకర్తలు కొంత అసహనంగా ఉన్నా కొంత వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అనుచరగణం నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీలో గౌరవం, సముచిత స్థానం ఉంటుందని భావించినా.. అవమానాలు, గుర్తింపు లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపాలని కోరంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
కొద్దిరోజుల క్రితం ఖమ్మం నగరానికి చెందిన పొంగులేటి అనుచరుడు ఆకుల మూర్తి అనే నేత కాంగ్రెస్ పార్టీలో కొనసాగి తిరిగి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పొంగులేటి బీఆర్ఎస్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తననెంతో బాధించాయని, సమయం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తానని ఆకులమూర్తి ప్రకటించారు. ఆ షాక్ నుంచి పొంగులేటి శిబిరం తేరుకోకముందే భద్రాద్రి ఏజెన్సీలో ఆదివాసీ నేతగా, పేరొందిన వైద్యుడిగా, ప్రజలకు తలలో నాలుకగా ఉన్న తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీని వీడడం పొంగులేటికి మరో షాక్ అని కాంగ్రెస్ పార్టీ వర్గాల వారే భావిస్తున్నారు. తెల్లం చేరికతో మరికొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పునరాలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అలాగే సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పొంగులేటి ప్రధాన అనుచరుడిగా మట్టా దయానంద్‌కు పేరున్నది. నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి బీఆర్ఎస్లో చేరుతున్నప్పుడు దయానంద్ కూడా చేరారు. పొంగులేటి బీఆర్ఎస్కు దూరంగా ఉన్న సమయంలో ఆయనతో దయానంద్‌కు రాజకీయ విభేదాలు వచ్చాయి. దయానంద్ దీంతో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దయానంద్ వంటి సీనియర్ నేత పొంగులేటిని వీడడం అప్పట్లో పొంగులేటి శిబిరంలో చర్చనీయాంశమైంది. ఏదేమైనా పొంగులేటి ప్రధాన అనుచరులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌పార్టీని వీడడం రాజకీయపరంగా ఆయనకు నష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భద్రాచలం, ఆగష్టు 16: బీఆర్ఎస్తోనే తన పయనమని బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ భద్రాచల నియోజకవర్గ మాజీ ఇన్చార్జి తెల్లం వెంకట్రావ్ స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో తిరిగి చేరేందుకు హైదరాబాద్ బయల్దేరుతూ మీడియాతో మాట్లాడారు. తాను అనారోగ్యానికి గురై మూడు నెలల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నానన్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానన్నారు. అప్పటి బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తాను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ను వీడానన్నారు. కానీ బీఆర్ఎస్ అంటే తనకు అభిమానమన్నారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తిరిగి బీఆర్ఎస్లో చేరతానని స్పష్టం చేశారు.