– ప్రత్యామ్నాయం చూపి పనులు చేయాలన్న పోడుదారులు
– ఎఫ్డీఓ హామీతో అందోళన విరమణ
కారేపల్లి, జూలై 30 : ప్లాంటేషన్ పోడులో ఫారెస్ట్ అధికారులు పనులు ప్రారంభించారు. కాగా ప్లాంటేషన్ పోడుపై పోడుదారులు, ఫారెస్ట్ మధ్య వివాదం సాగుతూ ఉద్రిక్తలకు దారితీసి కేసు పెట్టుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు వివాదాస్పద ప్లాంటేషన్ పోడులో మంగళవారం నుండి పనులు ప్రారంభించారు. ఖమ్మం రూరల్ ఏసీపీ పరిధిలోని పోలీస్ సిబ్బంది సీఐ తిరుపతిరెడ్డి, కారేపల్లి, కామేపల్లి ఎస్ఐల ఆధ్వర్యంలో బందోబస్తు మధ్య ఫారెస్ట్ అధికారులు బుధవారం కూడా పనులు చేయడానికి జేసీబీలతో ప్లాంటేషన్ పోడుకు వెళ్తుండగా పోడుదారులు అడ్డుకున్నారు. జేసీబీలను అడ్డుకుని తమకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ప్లాంటేషన్లో పనులు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, పారెస్ట్ అధికారులు పోడుదారులతో మాట్లాడారు.
పోడుపై హక్కులు తెచ్చుకుంటే మీ జోలికి రామని అధికారులు తెలుపగా, ప్రత్యామ్నాయం పోడు చూపుతామని మభ్యపుచ్చి తమ జీవితాలు ఆగం చేయాలని చూస్తున్నారని పోడుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో మాట్లాడి పట్టాలు తేచ్చుకోవాలని, తమ విధులకు ఆటంకం కల్పించవద్దని అధికారులు సూచించారు. ప్లాంటేషన్ పోడు కోసం మాత్రమే ప్రత్యామ్నాయం పోడు చూపుతామని ఫారెస్ట్ అధికారులే హామీ ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం ద్వారా హక్కు తెచ్చుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసులు పెట్టి నిర్భందాలు పెట్టినా తమ పోడు దక్కే వరకు పోరాటం ఆగేది లేదని తేగేసి చెప్పారు.
ప్లాంటేషన్ పనులకు అడ్డు చెప్పవద్దని, ప్లాంటేషన్ పోడుదారుల సమస్యలపై ఖమ్మం ఫారెస్ట్ కార్యాలయంలో చర్చిద్దామని ఎఫ్డీఓ వెంకన్ననాయక్ అన్నారు. పోడుదారులతో మాట్లాడిన ఆయన జేసీబీలను వదిలి వేయాలని, రెండు రోజుల తర్వాత సమస్యలపై చర్చిద్దామన్నారు. దీంతో పోడుదారులు జేసీబీలను వదిలి వేశారు.