భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే గొంతునొక్కే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమని, ప్రశ్నించే వారిని పగబడితే ఊర్కునేది లేదని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పాల్వంచలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ కేటీఆర్, హరీశ్‌రావులు బీఆర్ఎస్ పార్టీకి రెండు బుల్లెట్ల లాంటి వారని, కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పై నిరంతరం పోరు కొనసాగిస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అహంకార పూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ చరిత్రలో గురువారం చీకటి రోజుగా మిగిలిపోయిందని, శాసనసభలో సభ్యుడి వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ పాలనను కాంగ్రెస్ మళ్లీ గుర్తు చేస్తుందన్నారు. నిరసన ర్యాలీలో బీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేంద్రరావు, సీనియర్ నాయకుడు కిలారు నాగేశ్వరరావు, సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్, మంతపురి రాజుగౌడ్, పూసల విశ్వనాథం, మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, దాసరి గేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.