భద్రాచలం, నవంబర్ 26 : వర్షపు నీటిని ఒడిసిపట్టి పెరటి తోటలు, కూరగాయల సాగుకు ఆ నీటిని వినియోగించుకుని జీవనోపాధి పొందాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివాసీ గిరిజనులకు సూచించారు. భద్రాచలం ఐటీడీఏలోని కాన్ఫరెన్స్ హాల్లో భారత రూరల్ లవ్లీ వుడ్ ఫౌండేషన్, ఈజీఎస్ ద్వారా గిరిజనులకు ఉపయోగపడే వనరులపై మంగళవారం ఒరియంటేషన్ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామసభల ద్వారా పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు రైతులకు వారి పొలాల్లోనే నీటిని నిల్వ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
దుమ్ముగూడెం మండలం కొత్తూరు, పెద్దకమలాపురం, దబ్బనూతల, జిన్నెలగూడెం, మంగువాయిబాడువ గ్రామాల్లో ఈజీఎస్ ద్వారా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, కెనాల్, పెర్కులేషన్ ట్యాంకు పనులు చేయించడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయవచ్చన్నారు. చర్ల, కరకగూడెం మండలాల్లో గిరిజన రైతులను గుర్తించి వ్యవసాయం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో డేవిడ్‌రాజు, ఎస్వో భాస్కర్, ఎస్పీడీసీ ఉదయ్‌కుమార్, భారత రూరల్ లవ్లీ వుడ్ బృందం సభ్యురాలు శిరీష, ఏపీఎంలు సుకన్య, బక్కయ్య, సాయినివర్మ తదితరులు పాల్గొన్నారు.