బూర్గంపహాడ్(భద్రాచలం), ఆగస్టు 30 : విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో బోధించి ఉత్తీర్ణతా శాతం పెంచాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు సూచించారు. భద్రాచలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.
డార్మెటరీ బ్లాక్, కిచెన్ షెడ్డు, కూరగాయలు, పాఠశాల లోపల, బయట తరగతి గదులు, టాయిలెట్స్, బాత్రూంల నిర్వహణను పరిశీలించారు. ఆహారాన్ని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా.. లేదా.. అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం కావడంతో విద్యార్థినుల ఆరోగ్య స్థితిగతుల గురించి హెచ్ఎంలు, వార్డెన్లు గమనిస్తూ ఉండాలని, సీజనల్ వ్యాధులకు గురైతే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలన్నారు.
రాత్రివేళ విద్యార్థినులను చదివించడానికి ఉపాధ్యాయులు స్థానికంగా ఉండాలని, సబ్జెక్టుల్లో ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేయాలన్నారు. 5, 8, 10 తరగతుల విద్యార్థినులకు గణితం బోధిస్తున్న తీరును పరిశీలించిన ఆయన విద్యార్థుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణను ప్రతిరోజూ శుభ్రం చేయించాలని, వార్డెన్లు ఇందుకోసం ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం సుభద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.