దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో రైతులు నరకయాతనపడ్డారు. పంటలు సాగు చేసుకోవాలంటే నీళ్లు, విద్యుత్, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, పనిముట్లు ఇచ్చిన పాపాన పోలేదు. అరకొరగా పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు. అప్పులపాలైనా పట్టించుకోలేదు. ఆత్మహత్యలు చేసుకున్నా కన్నెత్తి చూడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పంటలకు పుష్కలంగా సాగునీరు ఇస్తున్నది. 24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నది. సీజన్‌కు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నది. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తున్నది. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. రైతుబంధు ద్వారా సీజన్‌కు ముందే పంట పెట్టుబడికి సాయం అందిస్తున్నది.
రైతుబీమాతో రైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నది. ధరణి పోర్టల్‌తో భూములకు భద్రత కల్పిస్తూ.. దళారుల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయిస్తూ.. పైసా ఖర్చు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నది. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు పూటకో చోట, నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తున్నారు. మూడు గంటల కరెంటుతోనే పంట పండించుకోవచ్చని.. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని.. 24 గంటల కరెంటు దండగని ఉచిత సలహాలు ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు గంటల విద్యుత్ మూలకు సరిపోదని, భూమాత పోర్టల్‌తో దళారీ వ్యవస్థను తేవాలని చూస్తున్నదని మండిపడ్డారు.. మునుపటి రోజులు మళ్లీ వద్దని, నిత్యం మా మేలుకోరే కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, బీఆర్ఎస్కే మా మద్దతు ఉంటుందని చెబుతున్నారు.
నాటి కాంగ్రెస్ పాలనలో పేలే ట్రాన్స్ఫార్మర్లు, కాలే మోటర్లు తప్ప ఏముండె. ఆరు గంటల కరెంటు చెప్పుడే తప్ప ఇచ్చింది లేదు. గంటైనా కరెంటు ఉండేటిది కాదు. ఇయ్యాల మల్ల మూడు గంటల కరెంటు సాలు అంటున్నరు. నాడు సరిగ్గా కరెంటు ఇయ్యక లైన్లు సరిగా లేక ఎప్పుడు కరెంటు పోతదోనని ఆదరాబాదరాగా అందరూ ఒక్కసారే మోటర్లు వేస్తే టపాసులు పేలినట్లు ట్రాన్స్ఫార్మర్లు పేలేటియి. మల్లా ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఇచ్చేటోల్లు కాదు. రైతులంతా కలిసి ట్రాక్టర్ పెట్టుకుని పోయి చేనికాడికి తీసుకొస్తే దాన్ని పెట్టడానికి కరెంటోల్లు వచ్చేటోల్లు కాదు. ఒక్కోసారి రైతులు చందాలు ఏసుకుని ట్రాన్స్పార్మర్లు కొనేటోల్లు. కరెంటు మల్లా మల్లా వచ్చి పోతుంటే మోటర్లు కాలిపోతుండేయి వాటిని బాగు చేయించలేక యాష్టకొచ్చేది. సీఎం కేసీఆర్ సారు వచ్చినంకనే కరెంటు మంచిగుంటున్నది.. ఏ కష్టం లేకుండా పంటలు పండిచుకుంటున్నం… మల్లా ఆ సారు వస్తేనే బాగుంటుంది. మా మద్దతు బీఆర్ఎస్కే..
కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంట్ కోతలు.. కర్షకుల ఆత్మహత్యలు.. ఆకలి చావులేనని యావత్ తెలంగాణ రైతులు గుర్తుచేసుకుంటున్నారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెసోళ్లు తమకు కష్టాలే మిగిల్చారని, అధికారంలోకి రాక ముందు లేని పోని హామీలిచ్చి, అధికారం చేజిక్కించుకున్న తరువాత మాట మార్చడం వారికి అలవాటంటున్నారు. అది చాలదన్నట్లు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో రైతులను మోసం చేసేందుకు కాంగ్రెసోళ్లు దిగారంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పంటలకు 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తుంటే పీసీసీ అధ్యక్షుడు మూడుగంటల కరెంట్ ఇస్తే సరిపోతుందనడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పది హెచ్‌పీ మోటర్ వాడడం రైతుల వల్ల కాదని, అంత ఆర్థిక భారం మోయలేరంటున్నారు. ‘ధరణి’ స్థానంలో ‘భూమాత’ను తెచ్చి పచ్చగా ఉన్న గ్రామాల్లో భూతగాదాలు పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైందంటున్నారు. రైతులను పీడించుకుతినే ముత్తాతల కాలం నాటి పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కుట్రలు పన్నుతుందంటున్నారు. గెట్టు తగాదాలు, దళారీ వ్యవస్థకు ఆజ్యం పోసేందుకు ఎదురుచూస్తున్నదంటున్నారు. రెవెన్యూ వ్యవస్థలో తిరిగి లంచాల పీడ తెచ్చేందుకు యత్నిస్తుందని మండిపడుతున్నారు. వివరాలు వారి మాటల్లోనే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ఏంతో లబ్ధిచేకూరుతుంది. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు పారదర్శక సేవలందిచేలా రూపొందించిన సీఎం కేసీఆర్‌కు రైతాంగం రుణపడి ఉంటారు. ధరణీ పోర్టల్ ద్వారా పల్లెల్లో రైతాంగానికి సమయాభావంతో పాటు వ్యయప్రయాసలు కూడా తగ్గాయి. కానీ ధరణీ పోర్టల్ ప్రారంభం అయ్యాక మనకు తీరిక ఉన్న సమయంలో స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు వీలైన సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పావుగంటలో పూర్తవుతుంది. దీంతో దళారీ వ్యవస్థ పోయి రిజిస్ట్రేషన్‌కు నామమాత్రపు రుసుం ప్రభుత్వానికి చేరుతుంది. ధరణీ పోర్టల్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
కాంగ్రేసోళ్ల పాలనలో కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు, పగలంతా కరెంట్ ఉండకపోయేది. పొద్దుగూకిన తర్వాత ఆఫ్ కరెంట్ వచ్చేది. ఆరోజుల్లో కరెంట్ కోతలు తట్టుకోలేక కరెంట్ ఆఫీసుల ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేసేది. ఇప్పుడా పరిస్థితులు లేవు, రేయిబంవళ్లు నిరంతరాయంగా కరెంట్ ఉంటుంది. వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా పొద్దంతా సరఫరా వస్తుంది. మళ్లీ పాత రోజులను తలుచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. సీఎం కేసీఆర్ సార్ తెలంగాణ ప్రజలకు చేసిన మేలు ఎన్నటికీ మరువలేనిది. ఈసారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణలో ఇంకా ఎన్నో మంచి పథకాలు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి
-పురం నారాయణ, రైతు, కారేపల్లిక్రాస్రోడ్, సింగరేణి మండలం
ధరణి పోతే రైతు బతుకులు ఆగమే..
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాతనే భూముల విషయంలో రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూరింది. గతంలో వీఆర్వో, వీఆర్ఎ వ్యవస్థలతో అనేక ఇబ్బందులు పడ్డాం. ఏడాదికొకసారి భూ రికార్డులు మార్పులు చేర్పులు చేసేవారు. పట్వారీ వ్యవస్థ చేస్తున్న తప్పిదానికి రైతులు బలౌతున్నారనే సీఎం కేసీఆర్ సార్ ధరణిని తీసుకువచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్లు దాన్ని తీసేస్తామంటే ఊరుకుంటామా….?ఓటుతో బుద్ది చెప్పి తీరుతాం.. ఈసారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.
-పోలూరి నాగేశ్వరరావు, రైతు, కారేపల్లి మండలం
కాంగ్రెస్‌వి అమలు కాని హామీలు..
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలోని పథకాలు అమలు కావడం కష్టం. సాధ్యం కానీ హామీలిచ్చి రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. వ్యవసాయానికి 3 గంటలు సరిపోతుందనడం సరికాదు. 10 హెచ్‌పీ మోటర్లు పెడితే ప్యూజ్‌లు ఎగిరిపోతాయి. దిక్కుమాలిన కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవద్దు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. ఆయనకు రైతులంతా మద్దతు తెలపాలి.
-గండ్ర సోమిరెడ్డి, రైతు మర్లపాడు, వేంసూరు మండలం
ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రేవంత్‌రెడ్డి కొనిస్తాడా
10 హెచ్‌పీ మోటర్లు వేసుకుంటే దానికి తట్టుకోలేక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రేవంత్‌రెడ్డి కొనిస్తాడా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇస్తున్న 24 గంటల కరెంట్‌తో వ్యవసాయం మంచిగా చేసుకుంటున్నాం. ఎన్నికల కోసం 10 హెచ్‌పీ మోటర్లు, మూడు గంటలు కరెంట్ అని రైతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ అన్నట్లు 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే ఇద్దరు రైతులు రెండు మోటర్లు పెట్టుకుంటేనే ట్రాన్స్పార్మర్ కాలిపోతుంది. ఎక్కువ లోడ్‌పడి ట్రాన్స్పార్మర్ కాలిపోతే మళ్లీ కొనుక్కోవాలి. రైతులు 3 లేదా 5 హెచ్‌పీ మోటర్లు వాడుతున్నారు. ఇప్పుడు లేనిపోని మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నారు. రైతులెవ్వరూ నమ్మే పరిస్థితిల్లో లేరు. తెలంగాణ రాష్ట్రం మూడోసారి అధికారంలో వస్తుంది.
– గొర్ల శ్రీనివాసరెడ్డి, రైతు, కల్లూరుగూడెం, వేంసూరు మండలం
ధరణి అమలుతో యావత్ రైతాంగానికి మేలు
రైతులకు ఇబ్బందిలేకుండా ధరణి లాంటి భూ సంస్కరణ నిర్ణయం చరిత్రలో చిరస్ధాయిగా నిలచిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. రెవెన్యూ సంస్కరణలు ధరణీ పోర్టల్ ద్వారా అమల్లోకి రావడంతో కింది స్ధాయిలో రైతులకు పారదర్శకంగా సులువైన పద్దతిలో రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తి అయి నేరుగా రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకం అందుతున్నది. గతంలో రైతుల భూముల రిజిస్ట్రేషన్‌కు వీఆర్వోలు, రాజకీయ నాయకులు, అధికారులు తదితరులను ప్రసన్నం చేసుకోవాల్సిందే…. కానీ ధరణీతో భూమి కొన్నా, అమ్మినా రైతులు రాజుల్లాగా దర్జాగా పట్టాలు మార్చుకుంటున్నారు. దటీజ్ కేసీఆర్..హ్యాట్సాఫ్ టు సీఎం కేసీఆర్ సార్..
-గడ్డం శ్రీనివాసరావు, రైతు, నాగిలిగొండ,చింతకాని మండలం
కేసీఆర్ అభయంతోనే సాగు చేస్తున్నాం
సీఎం కేసీఆర్ ఉన్నారన్న అభయంతోనే మేము ధైర్యంగా సాగు చేస్తున్నాం. గతంలో చాలీచాలని కరెంటుతో అనేక ఇబ్బందులు పడ్డాము. గతంలో సాగు చేయాలంటేనే భయం వేసేది. ఉన్న భూమిని వదులుకోలేక నలుగురు ఏమనుకుంటారో అని సాగు చేశాం. కానీ కేసీఆర్ వచ్చినంక పరిస్థితి మారింది. రైతులకు సాగుకు ఏం కావాలో అన్ని తెలిసిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఆయన వచ్చాకనే విత్తనాలు, ఎరువులన్నీ దొరుకుతున్నాయి. ఇంతమంచి సౌకర్యాలు చేసిన సీఎం కేసీఆర్‌ను మేము ఎందుకు వదులుకుంటాం. కాంగ్రెన్ పాలన అంటేనే అంతా అరాచకం, అవినీతి పాలన.
-భూక్యా సంపత్, తీర్ధాల, ఖమ్మం రూరల్
నాడు ఆకలిచావులు, ఆత్మహత్యలు
కాంగ్రెస్ పాలన అంటేనే ఆత్మహత్యలు, ఆకలిచావులు గుర్తుకు వస్తాయి. నాడు చాలీ చాలని కరెంట్ కారణంగా చేతికి వచ్చిన పంటలు ఎండిపోవడం, పెట్టిన పెట్టుబడి చేతికి రాకుండా పోయేది. దీంతో అప్పులు తీర్చలేక అనేక మంది రైతులు పొలాల్లోనే ఆత్మహత్యలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు అదే రైతులు సంతోషంగా సాగు చేస్తున్నారు. కారణం పుష్కలంగా సాగునీరు. కావల్సినంతసేపు కరెంటు, రైతుబంధు కూడా ఇస్తున్నారు. పొలాల దగ్గరనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏరైతుకు అయిన ఇంతకంటే ఇంకేం కావాలి.
కాంగ్రెస్ వస్తే మళ్లీ భూ సమస్యలే..
కాంగ్రెస్ నాయకులు అం టున్నట్లు అసలు పటేల్, పట్వారీ పద్దతి కావాలని కో రింది ఎవరో చెప్పాలి. గ తంలో లంచాలు ఇస్తేనే ప ని అయ్యేది. చదువు రాని రైతులు అయితే అప్పట్లో చాలా ఇబ్బంది పడ్డారు. రైతుకు తెలవకుండానే ఆ రైతు భూమి మాయం అయ్యింది. కానీ ధరణితో ఇబ్బంది లేకుండా పోయింది. మన బొటనవేలు పెడితేనే భూమి వేరే వారికి మారుతుంది. రైతులు మాకు ఇది కావాలని అడగకున్నా కాంగ్రెస్ నాయకులు మా పేరు చెప్పి బద్నాం చేస్తున్నారు. పాతపద్దతి వద్దనే సీఎం కేసీఆర్ కొత్త పద్దతి తీసుకొచ్చారు. మళ్లీ వెనకటి పద్దతి అని కాంగ్రెస్ నాయకులు మాటలు వీనే పరిస్థితిలో లేము.
ధరణి మారిస్తే అష్టకష్టాలు
ఇప్పుడే అన్నదమ్ముల మధ్య, గెట్ల పంచాయతీలు చాలా తగ్గిపోయాయి. ఈ పరస్థితిల్లో మళ్లీ ధరణీ తీసివేస్తే ఇంకేమైన ఉంటుందా. కాంగ్రెస్ నాయకులకు కూడా భూమలు ఉన్నాయి. వారికి కూడా ధరణీ ఉండబట్టే రైతుబంధు వస్తుంది. చనిపోయిన రైతుల కుటుంబాలకు రైతు బీమా ద్వారా రూ.5 లక్షల చొప్పున డబ్బు అందుతుంది. ఇంతమంచిగా ఏర్పాటు చేసిన ధరణీ తీసివేస్తే మళ్లీ ఎవరి కాళ్లు పట్టుకోవాలని వారు చూస్తున్నారు. కిరికిరి పట్టి రైతులను ఆగం చేయడం తప్ప కాంగ్రెస్ గెలిచేది కాదు.
కేసీఆర్‌తోనే కరెంటు సమస్యలు తప్పాయి
తెలంగాణ వస్తే అంధకారమే అని నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలకు సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో 24 గంటల కరెంటుతో సరైన సమాధానం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లకే ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో రాష్ట్రంలో కరెంటు సమస్యలు లేకుండా పరిష్కరించారు. ఒక టైలర్‌గా గత కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేకపోవడంతో బట్టలు కుట్టేందుకు తీవ్రమైన ఇబ్బందులు పడడంతో పాటు మిషన్‌ను కాళ్లతో తొక్కి బట్టలు కుట్టడం వల్లన అనారోగ్యానికి గురయ్యాము. వినియోగదారులకు సరైన సమయంలో అందించే పరిస్థితి లేదు. నేడు ఆ ఇబ్బందులు లేవు. 24 గంటల కరెంటు లభించడంతో మాకు ఉపాధి పెరిగింది. ఇలాంటి ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నాను.
24 గంటల విద్యుత్‌తో చేతి నిండా పని
రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా సక్రమంగా జరుగుతుంది కాబట్టే చేతి వృత్తులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి చేతి నిండా పని దొరుకుతుంది. కాంగ్రెసు హయాంలో సరఫరా సక్రమంగా లేకపోవడంతో పాటు లోవోల్టేజ్‌తో మోటర్లు కాలిపోయేవి. మోటర్లు రిపేర్ చేయాడానికి అవసరమైన మిషన్ నడిపించడానికి సరిగా కరెంట్ లేకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా పంట నష్టపోయేవారు. నాడు ఉండీ లేని కరెంటుకు చిన్న చిన్న ఉపాధి పనులు చేసుకునే వాళ్లకు సక్రమంగా పని దొరికేది కాదు. కానీ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాతో నాలాంటి వారికి ఉపాధి పుష్కలంగా దొరుకుతుంది. ప్రజలకు నిరంతరం విద్యుత్ ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను.
-గోగుల శ్రీనివాసరావు, ఎలక్ట్రికల్ మోగర్ల రివైండింగ్ మెకానిక్, ఖమ్మం
ధరణి ఎత్తివేస్తే ఎక్కడ చూసినా మళ్లీ భూ వివాదాలే..
ధరణీ పోర్టల్‌ను ఎత్తి వేస్తే ఎక్కడ చూసినా మళ్లీ భూవివాదాలే జరుగుతాయి. సీఎం కేసీఆర్ సార్ ధరణీని తీసుకువచ్చి రైతులకు మంచి మేలు చేశారు. ఎవరి భూమికి వారికి భద్రతను కల్పించారు. ఈ విధానం రాకముందు భూములకు రక్షణ లేకుండా పోవడమే కాకుండా తగాదాలు పెట్టుకొని తలలు పగిలిన రోజులు గుర్తుకు ఉన్నాయి. మళ్లీ అట్లాంటి దరిద్రపు రోజులు మాకొద్దు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కాకుండా వేరే ఎవరు అధికారంలోకి వచ్చినా మొదటగా నష్టపోయేది రైతు కుటుంబాలే. రైతన్నల బతుకులు బాగుండాలంటే కేసీఆర్ సీఎంగా ఉండాలి.
-జర్పల కేస్య, జోగ్గూడెం, కామేపల్లి మండలం
మళ్లీ సీఎం కేసీఆరే కావాలి..
మాకు 5ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ధరణీ రాక ముందు మా భూమికి పట్టాదారు పాసుపుస్తకం లేదు. ధరణీ వచ్చిన తర్వాత పట్టా చేపించుకున్నాం. నాభర్త నేను డిగ్రీలు చదివాము. ప్రభుత్వ కొలువులు రాలేదు. ప్రతీ ఏడాది 50వేలు రైతుబంధు పంట పెట్టుబడి సాయం అందుతున్నది. ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంది. రెండు ఎకరాల్లో పత్తి, రెండెకరాల్లో మిరప, ఎకరంలో వివిధ రకాల కూరగాయలు వేసి సాగు చేస్తున్నాం. నాభర్త వ్యవసాయం చూసుకుంటుంటే నేను మా చేను పక్కనే ఉన్న రోడ్డుపై కూరగాయలు విక్రయిస్తూ ఆర్థికంగా లాభం పొందుతున్నాను. ఇదంతా సీఎం కేసీఆర్ సార్ వల్లే.మళ్లీ కారే గెలవాలి..కేసీఆర్ సారే సీఎం కావాలి.
-జర్పుల సౌందర్య, కారేపల్లి క్రాస్‌రోడ్, కారేపల్లి మండలం
ధరణితో రికార్డులు పదిలం
కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వస్తే భూమాత పోర్టల్‌ను తీసుకొస్తామంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది. గతంలో భూ రికార్డులకు భద్రత లేకుండా పోయేది. నేడు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌తో భూరికార్డులు పదిలంగా ఉన్నాయి. ధరణి ఏర్పాటు వల్లనే నేరుగా రైతుబంధు నిధులు మా ఖాతాలోకి వచ్చి పడుతున్నాయి. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి వారికి ఓటు వేస్తే పదిలంగా ఉన్న ధరణిని రద్దు చేసి.. భూమాత ప్రవేశపెట్టి రైతులను నిండా ముంచడం ఖాయం.
-యన్న శ్రీనివాసరెడ్డి, మీనవోలు, ఎర్రుపాలెం మండలం
కరెంట్ కష్టాలు తొలగినై
సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేరుకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పి అరకొరగా అర్థరాత్రి కరెంట్ ఇచ్చేవారు. రైతులు తమ పొలాల్లో మోటర్లు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్‌తో చనిపోయిన సందర్భాలున్నాయి. కానీ.. తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ అందిస్తుండడంతో రైతులు సంబురంగా పంటలు సాగు చేసుకుంటున్నారు. అప్పట్లో కరెంట్ రావడం రికార్డు అయితే.. ఇప్పట్లో కరెంట్ పోవడం రికార్డు. ముందు చూపుతో నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు రైతులు ఎప్పటికీ మరువరు.
-చెన్నంరాజు పురుషోత్తంరాజు, సర్పంచ్, రేమిడిచర్ల, ఎర్రుపాలెం మండలం
ఖర్చుతో కూడుకున్నది
10 హెచ్‌పీ మోటర్ వాడకం అనేది ఖర్చుతో కూడుకున్నది. కాంగ్రెసోళ్లు రైతులను ఆగం చేయడానికే 10హెచ్‌పీ మోటర్లు అని పూటకో మాట మాట్లాడుతున్నారు. నిజానికి రైతులు 3హెచ్‌పీ, 5హెచ్‌పీ మోటర్లను వాడుతరు. అంత పెద్ద మోటార్లను రైతులు ఎవరూ పొలం దగ్గర వాడరు. అందుకు రూ.లక్షలు ఖర్చయితయ్. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతులను పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అప్పుడే మర్చిపోతామా. మాకు ఇప్పుడున్న కరెంటే కావాలి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక రైతులకు కరెంటు కష్టాలు తప్పాయి. మాకు ఇప్పుడున్న కరెంటు చాలు.
– రామా వెంకటేశ్వర్లు, రైతు, కోటపాడు
ధరణి ఎత్తేస్తే దళారీ వ్యవస్థ తప్పదు
దళారీ వ్యవస్థ కోసమే కాంగ్రెస్ భూమాత పథకాన్ని తెస్తామంటూ మాట్లాడుతొంది. కాంగ్రెస్ హయాంలో రైతుల భూములకు రక్షణ లేకుండా పోయింది. ఇష్టానుసారంగా రెవెన్యూ రికార్డులు మారినయ్. రికార్డుల్లో పేర్లు ఇష్టమొచ్చినట్లు ఎక్కించుకున్నరు. ధరణి వచ్చిన తరువాత వాటన్నింటికీ చెక్ పడింది. ధరణీని ఎత్తేస్తే మళ్లీ మోసాలు ఎక్కువు అవుతాయి. కౌలుదారులు, అనుభవదారులకు కొట్లాటలు మొదలవుతాయి. ధరణీ వచ్చినంకనే సులువుగా రిజిస్ట్రేషన్లు అవుతున్నయి. ఇంత మంచి విధానాన్ని ఎత్తేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నరు. ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతాం.
-జాటోతు సూర్యా, రైతు, సూర్యాతండా
ధరణి ఎత్తివేస్తే మళ్లీ భూ సమస్యలు వస్తాయి
ధరణి పోర్టల్‌ను ఎత్తివేస్తానని అనడం రైతులకు నష్టం కలిగే విధానమే. భూమాత పోర్టల్ పెట్టి దానిలో కౌలు ధరలకు హక్కులు కల్పించే విధంగా వ్యవహరిస్తే అసలు రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. ఈ ధరణి వల్లే రైతులకు ఎంతో ప్రయోజనం ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు పూర్తిస్థాయిలో అందుతున్నాయి. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు రైతులకు అండగా నిలిచాయి. ఈ ధరణి ఎత్తివేయడం వల్ల భూ సమస్యలు మొదలవుతాయి. దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఏర్పడాలి. అప్పుడే రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుంది.
– వేమూరి ప్రసాద్, రైతు, తూటికుంట్ల
మళ్లీ కరెంట్, భూ సమస్యలు కొని తెచ్చుకోము
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలతో వ్వవసాయం చేసుకోలేక వదిలి వెళ్లిన వారు ఉన్నారు. కరెంట్ లేక పడిన కష్టాలు కేసీఆర్ రావడంతో తీరాయి. 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట పండించుకుంటున్నాం. వ్యవసాయానికి కేసీఆర్ రావడంతో మంచి రోజులు వచ్చాయి. భవిష్యత్‌లో కరెంట్, ధరణి రెండూ ఉండాల్సిందే. కేసీఆర్‌తోనే వ్యవసాయరంగంలో మార్పులు వచ్చాయి. కాంగ్రెస్ వద్దు.. కష్టాలు రావద్దు.
-వాసంశెట్టి వెంకటేశ్వర్లు, రాజుపేట, కూసుమంచి మండలం
కోతల్లేని కరెంట్‌తో పంటలు పుష్కలం
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు ఉండేవి. పంటలు పండించాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. కరెంట్ కోతల వల్ల రాత్రింబవళ్లు జాగారం చేశాం. కరెంట్ కష్టాలతో వ్యవసాయం వదిలి పోయిన వాళ్లు ఉన్నారు. రెండు మూడు గంటల కరెంట్‌తో పంటలు కాపాడుకోలేక బాధలు పడ్డాం. ఇప్పుడు రెండు పంటలు పండుతున్నాయి. రైతులకు కరెంట్ ముఖ్యం. 24 గంటల కరెంట్ ఉండాల్సిందే.. లేకపోతే మళ్లీ వ్యవసాయం కష్టంగా మారుతుంది.
-నెల్లూరి శ్రీను, కూసుమంచి
ధరణితో సులువుగా భూమార్పిడి
గతంలో నా భర్త పేరుమీద ఉన్న భూమిని నా పేరుమీద ఎక్కించాలని సంవత్సరం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ధరణి వచ్చినంక దళారుల రాజ్యం పోయింది. ఇబ్బందులు లేకుండా పోయాయి. నా భర్త పేరు మీద ఉన్న భూమిని నా పేరుమీద ఎక్కించుకున్నా. పైరవీకార్లు లేరు.. మాలాంటి పేదలకు ధరణి ఉండాలి. ఎవ్వరికీ లంచం ఇవ్వకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా పని అయిపోతుంది. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ధరణి పేద, మధ్య తరగతి రైతులకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది.
-మండవ నాగమణి, నాయకన్‌గూడెం, కూసుమంచి మండలం
కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంట్ కష్టాలే..
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే రైతుకు 24 గంటలు కరెంట్ అందుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్లీ కరెంట్ సమస్యలు మొదలువుతాయి. రేవంత్‌రెడ్డి మూడు గంటలు కరెంట్ సరిపోతుందని చెప్పడం సరైంది కాదు. 10 హెచ్‌పీ మోటార్ ద్వారా పంటలను సాగు చేసుకోవాలని అనడం సబబుకాదు. చిన్న, సన్న కారు రైతులకు 10 హెచ్‌పీ మోటార్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో నాణ్యమైన కరెంట్ ఇస్తుంది. ఇచ్చే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలే తప్ప మూడుగంటలే కరెంట్ ఇస్తానన్న పార్టీకి ఓట్లేసే ప్రసక్తే లేదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలో ఏర్పడి రైతులకు న్యాయం జరగాలంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడాలి.
-కొనకంచి నాగరాజు, చొప్పకట్లపాలెం, రైతు