బోనకల్లు, సెప్టెంబర్ 08 : బోనకల్లు మండల పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన 60 నిరుపేద కుటుంబాలు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ గ్రామ కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, నిరుపేద కుటుంబాలకు మంజూరు చేయలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపురం మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత మాట్లాడుతూ.. గోవిందాపురం ఎల్ గ్రామంలో 4 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారన్నారు. అనేక ఏళ్లుగా పూరి గుడిసెల్లో నివాసం ఉంటూ సెంటు భూమి కూడా లేని వారికి ఇల్లు మంజూరు చేయలేదన్నారు.
రాజకీయ కారణాలతో ఇందిరమ్మ కమిటీ సభ్యులు నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామాల్లో అర్హత కలిగిన వారికి ఇవ్వాలని ఒకవైపు ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు చెబుతున్నారన్నారు కానీ కేవలం రాజకీయ కారణాలతో కాంగ్రెస్ కు చెందిన వారికే ఇల్లు మంజూరు చేయడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు. సిపిఎం మాజీ ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య, నాయకులు తమ్మారపు లక్ష్మణ్, కొమ్ము శ్రీనివాసరావు, వల్లంకొండ సురేశ్, ఏడునూతల లక్ష్మణరావు పాల్గొన్నారు.