అశ్వారావుపేట టౌన్/ఇల్లెందు రూరల్, అక్టోబర్ 14 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ సోమవారం చుక్కలు చూపించింది. దసరా వేడుకలు, విద్యాసంస్థలకు సెలవులు ముగియడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. వార ఆరంభం కావడం.. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఒక్కసారిగా బయలుదేరడం వంటి కారణాలతో ఆర్టీసీ బస్టాండ్లన్నీ ఉదయం నుంచే ప్రయాణికులతో కిటకిటలాడాయి. ‘బస్సుల్లో సీట్లు లభించడం సంగతి దేవుడెరుగు.. కనీసం నిలబడి ప్రయాణించేందుకు చోటు దొరికినా చాలు..’ అనుకుంటూ ప్రయాణికులు అగచాట్లు పడడం సోమవారం నాటి రద్దీకి నిదర్శనం.
బతుకమ్మ, దసరా పండుగల కోసం పది, పదిహేను రోజుల క్రితమే వసతి గృహాల నుంచి ఇళ్లకు వచ్చిన విద్యార్థులు.. మంగళవారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండడంతో సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. మళ్లీ సరంజామా అంతా మోసుకుంటూ వారిని హాస్టళ్ల వద్ద దింపేందుకు తల్లిదండ్రులు కూడా తోడు రావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పండుగ వేడుకలను కుటుంబ సభ్యులతో గడిపేందుకు సొంతూళ్లకు వచ్చిన దూర ప్రాంతాల ఉద్యోగులు, కార్మికులు కూడా తిరిగి తమ పని ప్రదేశాలైన పట్టణాలు, నగరాలకు వెళ్లేందుకు సోమవారమే ప్రయాణమయ్యారు. పండుగలకు వచ్చిన బంధువులు కూడా ఇదే రోజున తిరిగి తమ సొంతూళ్లకు బయలుదేరడంతో రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
దసరా పండుగ కోసం జిల్లాలోని అంతర్గత సర్వీసులను కుదించిన ఆర్టీసీ అధికారులు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అదనపు బస్సులను పెంచింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి నగరాలకు రాకపోకలు సాగించే సర్వీసులు అమాంతం తగ్గాయి. ‘స్పెషల్ బోర్డులు, స్పెషల్ సర్వీసు నెంబర్ల’తో హైదరాబాద్‌కు గణనీయమైన సంఖ్యలో బస్సులు నడిచాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో పట్టణాల మధ్య రాకపోకల కోసం బస్సుల సంఖ్య అదేస్థాయిలో తగ్గడంతో ప్రయాణికులు అరిగోస పడ్డారు.
స్పెషల్ బస్సుల పేరిట నడిపిన సర్వీసుల్లో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేశారు. ఉదాహరణకు.. రెండు పట్టణాల మధ్య మామూలు రోజుల్లో సాధారణ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.100 చార్జీ అనుకుంటే సోమవారం నడిపిన ప్రత్యేక బస్సుల్లో 50 శాతం చార్జీ పెంచారు. అంటే మరో రూ.50 అదనంగా ప్రయాణికులపై భారం వేశారు. దీంతో అదే మార్గంలో మామూలు రోజుల్లో రూ.100గా ఉన్న చార్జీ సోమవారం నాటి ప్రత్యేక బస్సుల్లో రూ.150 చొప్పున చార్జీలు విధించారు.
ఇక ఇదే బస్సుల్లో ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళా ప్రయాణికులను అనుమతించలేదు. ఒకవేళ మహిళలు బస్సు ఎక్కినా వారి వద్ద నుంచి స్పెషల్ చార్జీలో 50 శాతం వసూలు చేశారు. అంటే ప్రత్యేక సర్వీసులో విధించిన రూ.150లో 50 శాతం అంటే రూ.75 చొప్పున మహిళల వద్ద చార్జీలు తీసుకున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు మహిళలు 50 శాతం చెల్లించి టికెట్ తీసుకోగా.. మరికొందరు మహిళలు సాధారణ ఎక్స్‌ప్రెస్ బస్సు వచ్చేంత వరకూ ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఇక భద్రాచలం, మణుగూరు డిపోల నుంచి హైదరాబాద్‌కు నడిపిన ప్రత్యేక బస్సులకు స్టేజీలను అమాంతంగా కుదించారు. భద్రాచలం నుంచి బయలుదేరిన స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బస్సులకు పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో మాత్రమే స్టాప్‌లు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని సుజాతనగర్, జూలూరుపాడు, ఏన్కూరు, తల్లాడ, వైరా, కొణిజర్ల స్టేజీల్లో స్టాపులు లేవంటూ చెప్పడంతో వారంతా ఆయా బస్సుల్లో ప్రయాణించలేకపోయారు.