గతంలో ఉపాధి లేక ఎంతో మంది పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితుల్లో అర్ధాకలితో అలమటించిపోయారు. రైతులు, కూలీలు, యువత పని కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న క్రమంలో ఒకానొక దశలో ఊళ్లకు ఊళ్లూ ఖాళీ అవుతాయని ఆందోళన చెందారు. కానిప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కరువుతో అల్లాడిన పాలేరు ప్రాంతం నేడు ఉపాధి కేంద్రంగా మారింది. రైతులు, వలస కూలీలకు పనులు కల్పించే అడ్డాగా మారింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి వందలాది మంది కూలీలు ఖమ్మం జిల్లాలోని పలు మండలాలకు ఉపాధి కోసం వస్తున్నారు. నాలుగైదు నెలలు ఉండి పనులు చేస్తున్నారు. నాడు బోసిపోయిన పల్లెలు నేడు కూలీల రాకతో సందడిగా కనిపిస్తున్నాయి.
కూసుమంచి, మే 4: ‘నుదుటి రాత బాగలేకపోతే పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సి వస్తుంది’ అంటూ మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాల గురించి పెద్దలు ఉపమానం చెబుతుంటారు. ఈ నానుడిలో నుదుటి రాత సంగతి ఎలా ఉన్నా.. నాడు ఉమ్మడి పాలనలో సీమాంధ్ర పాలకులు చూపిన వివక్షకు పాలేరు ప్రాంతం కరువు కాటకాలతో కటకటలాడింది. ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్లుగా వారు తవ్విన ఎస్ఆర్ఎస్పీ కాలువలు చెత్తాచెదారంతో నిండి ఉన్నా అందులో కనీసం చుక్క నీరైనా పారలేదు. చెంతనే పాలేరు ఉన్నా దానిలోని నీళ్లన్నీ ఆంధ్రాకే తరలించుకుపోయే వారు. స్థానికంగా ఒక్కసాగునీటి ప్రాజెక్టునూ నిర్మించలేదు. ఇక్కడి భూముల సాగును చుక్క నీటినీ అందించలేదు. ఫలితంగా పాలేరు ప్రాంతంలో కరువు విలయతాండవం చేసేది. దీంతో పాలేరు ప్రాంతంలోని ప్రజలు, కూలీలు, రైతులు తమ పంట భూములను ఇక్కడే వదిలేసి పట్టణాలకు వలసెల్లిపోయేవాళ్లు. అక్కడే ఏదో ఒక పని చేసుకొని జీవించేవాళ్లు. పైసో పావలో కూడబెట్టి సొంతూళ్లో ఉన్న వృద్ధులకు గాసంగా పంపేవాళ్లు.
ఇంతటి కరువు కాటకాలను చూసిన పాలేరు ప్రాంతం తెలంగాణ సిద్ధించాక జీవం పోసుకుంది. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో కట్టెలమ్మినట్లుగా బతుకులీడ్చిన ఇక్కడ ప్రజలు, కూలీలు, రైతులు ఇప్పుడు తమ ఊళ్లలోనే పూలమ్ముతున్నట్లుగా జీవిస్తున్నారు. స్వరాష్ట్రం ఏర్పడడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం, స్థానికంగా సాగునీటి వనరులు ఏర్పాటు కావడం ఇక్కడి ప్రజల తలరాతను మార్చినట్లయింది. ప్రధానంగా భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణం కావడం, మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులన్నీ జవసత్వాలు పోసుకోవడం, భూగర్భ జలాలు పెరగడం ఇక్కడి రైతుల దిశను మార్చింది. ఫలితంగా మొన్నటి వరకూ బీళ్లుగా ఉన్న భూముల్లో ఇప్పుడు రెండు పంటలు పండుతున్నాయి. పుష్కలంగా సాగునీళ్లు ఉండడంతో పంటల సాగుకు ఢోకా లేకుండా పోయింది. దీంతో ఇప్పుడీ ప్రాంతం పొరుగు రాష్ర్టాల వలస కూలీలకు ఉపాధి కేంద్రంగా మారింది. ఒకనాడు వలవలవల ఏడ్చుకుంటూ వలసెళ్లిపోయిన పాలేరు ప్రజలు ఇప్పుడు అదే వలస కూలీలకు చేతినిండా పనులు కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన వనరులను సద్వినియోగం చేసుకుంటున్నారు.
సాగునీటి వనరులతో పాలేరు ప్రాంతంలో పుష్కలంగా పంటలు పండుతుండడం, కూలీ పనులు లభిస్తుండడంతో పొరుగు రాష్ర్టాల ప్రజలు ఉపాధి కోసం వస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి వందలాదిగా వచ్చి ఇక్కడి రైతుల వద్ద కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కూసుమంచి, గట్టుసింగారం, నేలపట్ల, జీళ్లచెరువు, పోచారం, తిరుమలాయపాలెం, ముదిగొండ, ఖమ్మం రూరల్ ప్రాంతాల్లో సాగవుతున్న మిర్చి తోటల్లో ఈ వలస కూలీలు పనులు చేస్తున్నారు. పొలాల వద్దే గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు. సీజన్‌ను బట్టి ఏడాదిలో నాలుగైదు నెలలు ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్నారు. ఆయా సీజన్లను బట్టి మిర్చి తోటల్లో మిర్చిని, పత్తి చేలలో పత్తిని ఏరుతున్నారు. చెరుకు తోటల్లో చెరుకును నరుకుతున్నారు. జామాయిల్, సుబాబుల్ తోటల్లో వాటినీ కటింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. పంట చేల వద్దనే నివాసముంటున్న వలస కూలీలు ఉదయం ఆరు గంటలకే పనుల్లో నిమగ్నమవుతున్నారు.
మాది మహారాష్ట్ర. ఉపాధి కోసం ఇక్కడికి వచ్చాం. ఇటుక బట్టీల్లో పని చేస్తున్నాం. ఏడాదిలో సుమారు ఏడు నెలలపాటు ఇక్కడే నివాసముంటాం. ఇటుక బట్టీల్లో పనిలేని సమయంలో చెరుకు తోటల్లో చెరుకు నరికే పనులు చేస్తాం. మాతోపాటు ఛత్తీస్‌గఢ్ కూలీలు కూడా ఉన్నారు. ఇటుక బట్టీల్లో పని చేస్తే రోజుకు కనీసం రూ.800 నుంచి రూ.1200 వరకూ కూలి వస్తోంది. బట్టీల వద్దే గుడారాలు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నాం. మాకు విద్యుత్, తాగునీటి సౌకర్యాలను యజమానులు ఏర్పాటు చేస్తున్నారు. పొరుగున ఉన్న ఏపీలోని తుని, విశాఖపట్నం, గాజువాక, ఎర్రగుంటపాలెం, తెనాలి, మాచర్ల, పిడుగురాళ్ల, గురజాల వంటి ప్రాంతాల కూలీలు కూడా కూలీ పనుల కోసం ఇక్కడికే వస్తున్నారు.
-పరమేశ్, ఇటు బట్టీల కూలీ, మహారాష్ట్ర
మావి 30 కుటుంబాలు. మా రాష్ట్రంలో పనులు లేక సుమారు 50 మందిమి ఇక్కడికి వచ్చాం. మూడేళ్లుగా ఏటా సీజన్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ మిర్చి ఏరుతున్నాం. రోజుకు రూ.600 నుంచి రూ.800 వరకూ కూలి డబ్బులు వస్తాయి. మధ్యాహ్నం చావల్ దాల్, రాత్రికి రోటీ తింటాం. పిల్లలతో సహా ఇక్కడే ఉంటాం. సీజన్లో మొత్తం నాలుగు నెలలపాటు ఇక్కడే జీవిస్తాం. ఇక్కడి రైతులు మాకు కేజీల లెక్కన కూలి డబ్బులు చెల్లిస్తారు. ముందుగా కొంత అడ్వాన్స్ కూడా ఇస్తారు. వాటితో కావాల్సిన సరుకులు తెచ్చుకుంటాం. ఎక్కడ పని ఉంటే అక్కడే గుడారం వేసుకొని నివాసం ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ పనులు పుష్కలంగా ఉన్నాయి. దంపతులిద్దరమూ కష్టపడితే నాలుగైదు నెలల్లో సుమారు రూ.2 లక్షల వరకూ సంపాదిస్తాం. -మౌర్యాదేశ్, మధ్యప్రదేశ్ కూలీ