అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు మహిళా బంధు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో శనివారం సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 130 అడుగుల విస్తీర్ణంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, పింఛన్లు, మహిళా బంధు నమూనాలను రంగవల్లులతో తీర్చిదిద్దారు. నూతన దంపతులకు కేసీఆర్ అక్షింతలు వేస్తున్నట్లు, హిందూ, ముస్లిం, క్రైస్తవుల వివాహాలు జరుగుతున్నట్లు ప్రతిబిం బించేలా గీసిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సత్తుపల్లి, మార్చి 5: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్నీ పేదింటి దీపాలుగా వెలుగొందుతున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో శనివారం మహిళాబంధు సంబురాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. అద్భుతమైన పథకాలను అమలు చేస్తూ నెంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ వైపే దేశంలోని అన్ని రాష్ర్టాలూ చూస్తున్నాయని అన్నారు. ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్ల దగ్గర నుంచి కేసీఆర్ కిట్ల వరకూ మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి కలిగిస్తున్నారని వివరించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా ఏప్రిల్ నుంచి సొంత స్థలాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అనుమతి, 57 ఏళ్లు దాటిన వారికి పింఛన్ల అందజేత వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో మూడు రోజుల పాటు ఘనంగా మహిళాబంధు సంబరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
8న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6 నుంచి మూడు రోజుల పాటు మహిళాబంధు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో శనివారం ఉత్సవాలను ప్రారంభించారు. 130 అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు పింఛన్లతోపాటు ‘జయహో కేసీఆర్, థ్యాంక్యూ కేసీఆర్, మహిళాబంధు’ నమూనాలను రంగవల్లులతో తీర్చిదిద్దారు. నూతన దంపతులకు కేసీఆర్ అక్షింతలు వేసేలా, ముస్లిం, క్రైస్తవుల వివాహ సంప్రదాయాలు ప్రతిబింబించేలా చిత్రాలను గీశారు. బెలూన్లు, చీరెలతో మున్సిపల్ కార్యాలయ ఆవరణను అలంకరించారు. దీంతో ఈ ప్రాంతంలో సందడిగా నెలకొన్నది.
మహిళాబంధు సంబురాలకు హాజరైన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ‘జయహో కేసీఆర్, థ్యాంక్యూ కేసీఆర్, మహిళాబంధు కేసీఆర్’ అనే ప్లకార్డులను చేతుల్లో పట్టుకొని సండ్రకు స్వాగతం పలికారు. ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ మీనన్, కమిషనర్ సుజాత, ప్రత్యేకాధికారి ధన్‌రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమావతీ శంకర్రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, టీఆర్ఎస్ నాయకులు రఫీ, అంకమరాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.