ఖమ్మం, సెప్టెంబర్ 15: టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబాన్ని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. ఖమ్మంలోని సాంబశివరావు ఇంటికి సోమవారం వెళ్లిన నేతలు.. అతడి కుటుంబ సభ్యులను పలుకరించి ధైర్యం చెప్పారు.
సాంబశివరావుపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నట్లు చెప్పారు. అలాగే, అతడి కుటుంబానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్షకుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న రైతులు, రైతు సంఘాల నాయకులు, జర్నలిస్టులపై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయిస్తూ నిర్బంధాలు ప్రయోగిస్తుండడం విచారకరమని అన్నారు.
టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పెట్టిన కేసును తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు ఉప్పల వెంకటరమణ, బిచ్చాల తిరుమలరావు, బెల్లం వేణు, కర్నాటి కృష్ణ, మక్బూల్, శీలంశెట్టి వీరభద్రం, ఉద్యమకారులు గుండ్లపల్లి శేషగిరిరావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, ఉమాశంకర్, ముత్యాల వెంకట అప్పారావు, సద్దాం షేక్ తదితరులు పాల్గొన్నారు.