ఇల్లెందు, సెప్టెంబర్ 14: టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధితోపాటు కెమెరామెన్, లైవ్ టెక్నీషియన్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఇల్లెందు డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్లబ్జాడ్యీలు ధరించి ఇల్లెందులోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుర్రం రాజేశ్ మాట్లాడుతూ.. యూరియా అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలను కవర్ చేసేందుకు ఈ నెల 11న కొణిజర్ల పీఏసీఎస్ వద్దకు వెళ్లిన టీ న్యూస్ ప్రతినిధి వెన్నబోయిన సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజు, లైవ్ టెక్నీషియన్లను పోలీసులు అడ్డుకొని అక్రమ కేసు బనాయించడం దారుణమని అన్నారు. వారిపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంఘం నాయకులు రాజశేఖర్, సంతోశ్, శేషయ్య, డానియల్, రాధాకృష్ణ, నందు, వీరన్న, రవి, శివ, విజ్ఞాన్ పాల్గొన్నారు.
పాల్వంచ, సెప్టెంబర్ 14: టీన్యూస్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి సాంబశివరావుపై కొణిజర్ల పోలీసులు తప్పుడు కేసు నమోదు చేసినందుకు నిరసనగా సోమవారం నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడిని జర్నలిస్టులు జయప్రదం చేయాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జాతీయు సభ్యుడు చంద్ర నరసింహారావు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.