కారేపల్లి, సెప్టెంబర్ 15 : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని, అటువంటి వారిపై అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదని ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసరావు అన్నారు. సింగరేణి మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మండల ప్రెస్ క్లబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం విలేకరుల బాధ్యత అన్నారు. ఇటీవల కొణిజర్లలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను కవరేజీ చేసేందుకు వెళ్లిన ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధి వెన్నబోయిన సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజు, లైవ్ టెక్నీషియన్లను పోలీసులు అడ్డుకుని అక్రమ కేసులు పెట్టడం బాధాకరమన్నారు.
ప్రజా సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం విలేకరుల బాధ్యత అన్నారు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక శివాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఏపూరి లక్ష్మీనారాయణ, కొండపల్లి వెంకటేశ్వర్లు, అనంతారపు వెంకటాచారి, పాలిక శ్రీనివాస్, తేళ్ల శ్రీనివాసరావు, బానోత్ బాలు నాయక్, పగడాల నాగేశ్వరరావు, బాదావత్ రాము నాయక్, కందుల ప్రసాద్, జంగా నరేష్, కేతిమల్ల సురేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Karepally : ‘జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి’