ఖమ్మం సిటీ/ ఇల్లెందు/ కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 1: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు నమోదయ్యాయి. ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసులు మోపారు. ఆ పార్టీకి చెందిన ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మరో ఇద్దరిని ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు. కేసులో ఉన్న ఆరుగురిలో పోలెపోగు వెంకట్, పోలెపోగు ఉపేందర్లను కస్టడీలోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురిలో బీఆర్ఎస్ నాయకులు భూక్యా అశోక్, మాటేటి కిరణ్, నామవరపు ఈశ్వర్లపై పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.

అయితే, వారు అందుబాటులో లేకుండా పోయారు. బీఆర్ఎస్ నాయకులు తమ విధులకు ఆటంకం కలిగించడం, ఖమ్మం వన్ టౌన్ సీఐ కరుణాకర్‌ను గాయపరచడం అనే అభియోగాలను మోపినట్లు తెలుస్తోంది. అరెస్టయిన వారిని ఆదివారం రాత్రి ఏడు గంటల తర్వాత రిమాండ్ చేసి జిల్లా జైలుకు తరలించారు. అరెస్టయి ఖమ్మం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఉన్న పగడాల నాగరాజు సహా మరో ఇద్దరు నాయకులను ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వేర్వేరుగా పరామర్శించారు.

అదేవిధంగా, ఇల్లెందులో బీఆర్ఎస్ నేతలు అజ్మీరా భావ్‌సింగ్, పరుచూరి వెంకటేశ్వర్లు, అబ్దుల్ నబీ, ఉద్యమ నాయకులు రాజేష్, సైదులు, శ్రీనులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సిట్ విచారణను వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు ఆదివారం కొత్తగూడెంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన మేరకు వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్లు ముప్పారపు కరుణాకర్, ఇంద్రసేనారెడ్డి తెలిపారు.