కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 18 : మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ రవాణా వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం బస్టాండ్ నుంచి మేడారం జాతరకు వెళ్లే ప్రత్యేక బస్సులను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం సేవా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ… జాతరకు 140 బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ భక్తుల రద్దీ దృష్ట్యా ప్రైవేట్ బస్సులను సైతం అద్దె ప్రాతిపదికన నడిపించాలన్నారు.
డిపో అధికారులు, సిబ్బంది వారంరోజులపాటు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. కొత్తగూడెం డిపో పరిధిలో 30 ఆర్టీసీ బస్సులు, 35 ప్రైవేట్ బస్సులు సేవలందిస్తున్నాయని, వీటిసంఖ్యను పెంచేందుకు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు, రాంబాబు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సునీత, చంద్రగిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.