బోనకల్లు, ఆగస్టు 04 : జ్వరాలు సోకితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని బోనకల్లు మండల వైద్యాధికారిణి స్రవంతి ప్రజలకు సూచించారు. సోమవారం మండలంలోని గార్లపాడు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, మందులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు దోమల వల్ల సోకుతాయని, కావున వాటిని అరికట్టేందుకు ప్రజలు నివారణ చర్యలు పాటించడంతో పాటు, దోమ తెరలను ఉపయోగించాలన్నారు. ఎక్కువ రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ శిబిరంలో హెల్త్ సూపర్వైజర్ దానయ్య, ఏఎన్ఎంలు కృష్ణవేణి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.