ఖమ్మం రూరల్, జూలై 15 : కాలం నెత్తిమీదికి వచ్చినా వరుణుడి కటాక్షం లేకపోవడంతో వరి నాట్లు వేసుకునేది ఎట్లా, పంటలు పండించేది ఎట్లా అని ఖమ్మం రూరల్ మండల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా మండలంలోని మైదాన ప్రాంత గ్రామాల రైతులు జులై అర్థ మాసంలో వరి నాట్ల పనులు జోరుగా సాగిస్తుంటారు. ఇప్పటికే మండలంలోని చింతపల్లి, కొండాపురం, ఆరెకోడు, ఎంబి పాలెం, మంగళగూడెం, కస్మాతండా, కాచిరాజుగూడెం, తీర్థాల తదితర గ్రామాల రైతులు వరి నారుమడులు పోసుకుని పొలాలు దమ్ము చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
పోసుకున్న వరి నారుమల్లు ఈతకు రావటంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. పోసుకున్న వరి నారు మడులకు సాగునీరు అందించడమే గగనమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిత్యం పంట పొలాల వద్దకు వచ్చి ఆకాశం వైపు చూడడం అన్నదాతల వంతయింది. ఎలగటి పునాస పంటలను సాగు చేసుకున్న రైతులు వాటిని కాపాడుకునేందుకు అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
అప్పుడప్పుడు కురుస్తున్న కొద్దిపాటి జల్లుల సహాయంతో పత్తి చేలలో పాటు చేస్తున్నారు. సకాలంలో వరి నాట్లు పడితేనే ఆశించిన దిగుబడులు వస్తాయని, ఆలస్యంగా వారి పొలాలు సాగుచేస్తే చీడపీడల ఇబ్బంది తప్పదని రైతులు వాపోతున్నారు. మరో వారం, పది రోజుల్లో వరి నాట్లు పడితేనే బయట పడతామని, లేకపోతే మరోమారు స్వల్పకాలిక విత్తనాలను నారుమడులుగా పోసుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. గతేడాది అతివృష్టి కారణంగా మున్నేరు, ఆకేరు వాగులు పొంగడంతో చేతికొచ్చిన పొలాలు వరదల పాలయ్యాయని, ఈ ఏడాది అనావృష్టి, ఆశించిన వర్షపాతం లేకపోవడంతో మరోమారు ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు సైతం పనిలేకపోవడంతో వారు సైతం నిరాశ నిస్పృహలకు గురైతున్నారు.
Khammam Rural : వరి నాట్లు వేసుకునేదెట్లా..?