రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’ సమస్తం సందేహాలమయంగా మారింది. ఇంటింటికీ వెళ్లి సిబ్బంది సవాలక్ష ప్రశ్నలు సంధిస్తుండడంతో జనం భయపడుతున్నారు. ప్రశ్నావళిలో రూపొందించిన ప్రశ్నలకు జవాబులు చెప్పేందుకు ఇంటి యజమానులు సందేహిస్తున్నారు. ఏం సమాచారం చెబితే ఏం జరుగుతుందోనని జంకుతున్నారు. ఇప్పటికే తమకు అందుతున్న ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయా?..
కొత్త పథకాలు రాకుండా చేస్తారా?.. తమ వ్యక్తిగత సమాచారం బయటకు ఎందుకు చెప్పాలి?.. ఒక్క కుటుంబ సర్వేకే ఇన్ని ప్రశ్నలు అవసరమా?.. రైతుభరోసా, రుణమాఫీ వర్తింపజేసేందుకు కొర్రీలు పెడుతున్న సర్కారుకు ఇవన్నీ ఎందుకు? అనే సందేహాలు ఇంటి యజమానుల మెదళ్లను తొలుస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం సర్వేలోని వివరాలన్నీ పక్కాగా నమోదు చేయాల్సిందేనని చెబుతుండడంతో సిబ్బందికి తలకుమించిన భారంగా మారింది. మొత్తానికి సర్వే తొలిరోజే విభిన్న వర్గాల్లో తీరొక్క సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
-ఖమ్మం, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కులవృత్తిదారులు సైతం వార్షికాదాయం వివరాలు సర్వే బృందం సేకరించనుంది. అలాగే 31 నుంచి 40 వరకు ఆయా కుటుంబాలకు ఉన్న భూముల వివరాలను సేకరించనున్నారు. అందులో ధరణి పాస్‌పుస్తకాలతో సహా సేద్యం చేసే భూములు, సేద్యం చేయని పడావు భూములు వివరాలను అడిగారు. రైతుభరోసాను ఐదెకరాల వరకే ప్రభుత్వం వర్తింపజేస్తుందన్న సందేహాల నేపథ్యంలో ఈ వివరాలు అడగడంతో భవిష్యత్‌లో ఐదెకరాలకు పైన ఉన్న రైతులకు రైతుభరోసాలో కోతలు పెట్టే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రారంభమైంది. సర్వే నిర్వహణకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఇంటింటికీ వెళ్లి సర్వే సిబ్బంది సంధించే ప్రశ్నావళికి సంబంధించిన సమాధానాలు చెప్పేందుకు ఆయా కుటుంబసభ్యులు సందేహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సుమారు 6,33,304 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి 3,654 ఎన్యూమరేషన్ బ్లాక్‌లు, 3,719 మంది ఎన్యూమరేటర్లు, 314 మంది సూపర్వైజర్లు, ఒక్కో నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు.
బుధవారం నుంచి మూడురోజులపాటు ఎన్యూమరేషన్ సిబ్బంది ఆయా ఇళ్లకు సంబంధించి లిస్టింగ్ పూర్తిచేసి ఆయా ఇళ్లకు సర్వేకు సంబంధించిన స్టిక్కర్లను అంటించనున్నారు. ఒక్కో సర్వేయర్‌కు 150 ఇళ్లు కేటాయించారు. 15 రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తిచేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అయితే ఈ సర్వేపై ప్రజల్లో సవాలక్ష సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నావళిలో 56 ప్రశ్నలు, 75 అంశాలతో సేకరించనున్నారు. ఇందులో వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఉండడంతో ఏది చెబితే ఏమి ప్రమాదమో, ఏ సంక్షేమ పథకానికి తమను అనర్హులు చేస్తారన్న భయం పేద, మధ్యతరగతి వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ప్రతి కుటుంబానికి అరగంట సమయం కేటాయించి ప్రశ్నావళి రూపంలో ఆయా కుటుంబాల యజమానులకు పత్రాన్ని అందించి సమాధానం రాబట్టేలా సర్వేను రూపొందించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేగా ఈ సర్వేను పరిగణించనున్నారు. 15రోజులపాటు కంప్యూటరీకరణ పూర్తిచేసి నెలరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం రూపొందించిన సర్వే ఫార్మాట్లో కుటుంబ వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వివరాలే ఎక్కువగా అడుగుతుండడంతో వీటికి సమాధానం చెబితే ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొన్నది.
సర్వే ఫార్మాట్ ప్రకారం.. కుటుంబ యజమాని, సభ్యులు సమాధానాలు ఇస్తే దాని అనుబంధ ప్రశ్నలకు సైతం సమాధానం ఇవ్వాల్సి ఉండడంతో సర్వే రూపంలో కుటుంబసభ్యులను ఇరకాటంలో పెట్టేవిధంగా ఉందన్న అభిప్రాయం పేద, మధ్యతరగతి వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నావళిలో మీరు ప్రస్తుతం ఏంచేస్తున్నారనే ప్రశ్న అడిగారు.. దీనికి అనుబంధంగా అలాగే వ్యాపారం, రియల్ఎస్టేట్, పారిశ్రామికవేత్త అయితే వారి వార్షిక టర్నోవర్ వివరాలు నమోదు చేయాలని సూచించారు.
అలాగే మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా…? అని అడిగారు. ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నామని చెబితే సంక్షేమ పథకాలు భవిష్యత్‌లో వర్తింపచేస్తారో.. లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం పన్ను రిటర్న్స్, ప్రస్తుత పరిస్థితుల్లో అనేక అవసరాలకు ఉదాహరణకు బ్యాంకు లోన్లు, ఇతరత్రా వాటికి ఆదాయపు పన్ను రిటర్న్స్ సర్వసాధారణం కాగా.. ఆదాయ పన్ను చెల్లిస్తున్నామని చెప్పడం వల్ల భవిష్యత్‌లో కలిగే ముప్పుపై సాధారణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు, రుణమాఫీ వర్తింపజేసేందుకు ఈ తరహా అనేక నిబంధనలు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు కుటుంబ సర్వే ఆధారంగా తాము చెప్పిన సమాచారం తమ మెడకే చుట్టుకునే విధంగా ఉంటుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రశ్నావళిలో మీకు బ్యాంకు ఖాతా ఉందా? లేదా? అన్న ప్రశ్న ఇచ్చారు.
బుధవారం ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యవేక్షించారు. సర్వేలో పాటించాల్సిన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తొలి మూడురోజుల్లో చేయాల్సిన లిస్టింగ్, అనంతరం సేకరించాల్సిన సమాచారంపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజల్లో తలెత్తే పలు సందేహాలకు అధికారులు వివరణ ఇవ్వాలని, సమగ్ర సర్వే చేపట్టడం ఎటువంటి పథకాల రద్దుకు, సంక్షేమ కార్యక్రమాల కోతకు కాదని, వీటిపై ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరంలేదని, ఆయా ప్రాంతాల్లో కుటుంబ సర్వేకు సంబంధించి ప్రజలు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు.
ప్రతి కుటుంబానికి సర్వే కోసం అరగంట సమయం కేటాయించాలని, కచ్చితంగా సర్వేకు వస్తున్న సమాచారాన్ని ముందుగానే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ ద్వారకానగర్‌లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వలంటరీ ప్రక్రియ మాత్రమేనని, ప్రజలను బలవంతం చేసి సమాచారం సేకరించడం ఉండదని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, కార్మిక శాఖ సహాయ కమిషనర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.