ఈ లక్షణాలు కనిపిస్తే ఇలా చేయాలి దగ్గు లేదా తుమ్ము సమయంలో నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపరుతో కప్పు కోవాలి.సబ్బు, నీరు, ఆల్కహాల్-ఆధారిత శానిటైజర్‌తో తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.గుంపులతో కూడిన ప్రదేశాలకు వెళ్లకూడదు. ఫ్లూ ప్రభావిత వ్యక్తులకు దూరంగా నిలబడాలి.జ్వరం, జలుబు, దగ్గు ఉన్నట్లయితే ప్రజా ప్రదేశాలకు దూరంగా ఉండాలి.ఎక్కువగా నీరు తాగాలి. పోషకాహారం తీసుకోవాలి.వ్యాధి వ్యాప్తి తగ్గించడానికి బాగా గాలి చొరబడే ప్రదేశాల్లో ఉండటం మంచిది.అనారోగ్యంగా ఉంటే ఇతరులతో కలవకుండా ఇంట్లోనే ఉండాలి.కంటినిండా నిద్రపోవడం అత్యవసరం.
కరోనా ఎందరినో కాటేసింది.. తల్లిదండ్రులను తుదముట్టించి బిడ్డలను అనాథలను చేసింది.. వయో భేదం.. ఆర్థిక తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికీ కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆ మహమ్మారి కల్పించిన భయోత్పాతం నుంచి జనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నరు.. తాజాగా..! అచ్చం అలాంటిదే మరో ముప్పు పొంచి ఉందా..? ప్రాణాంతక వైరస్ పరుగెడుతూ మనదాకా వస్తోందా..? అలనాటి చేదు విషపు వలయాన్ని విసరనుందా..? అవునో.. కాదో.. తెలియదు కానీ..! సరిహద్దులు దాటుకుంటూ మన దేశంలో అడుగుపెట్టింది.. తెలంగాణ పొరుగునే ఉన్న బెంగళూరులో ప్రత్యక్షమయ్యింది.. ఓ చిన్నారి ఆరోగ్యాన్ని కబళించేందుకు సమాయత్తమైంది.. పిడుగులాంటి ఈ సమాచారం వెల్లడికావడంతో సబ్బండవర్గాలు ఆందోళనలో మునిగాయి. ఇంతకూ ఏమిటా వైరస్..? అధికారులు ఏం చెబుతున్నరు..? మనమేం చేయాలి అనే అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న కథనం.
– ఖమ్మం, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
చైనాలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. వైద్య పరిభాషలో దానిపేరు హ్యూమన్ మెటాన్యుమోవైరస్(హెచ్ఎంపీవీ) అని అంటున్నరు. కరోనాకు సరిసమానమైనదిగా చెబుతున్న ఈ మహమ్మారి ఆ దేశ సరిహద్దులను దాటుకుంటూ మనదాకా వస్తోంది. సోమవారం గుజరాత్, కర్ణాటక రాష్ర్టాల్లో కేసులు నమోదుకావడం, వివిధ ప్రసార మాధ్యమాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ప్రచారం వ్యాప్తిచెందడంతో ప్రజల్లో అలజడి రేగుతోంది. ప్రధానంగా తెలంగాణకు పొరుగునే ఉన్న బెంగళూరులో ఓ చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, వైరస్ కచ్చితంగా రాష్ట్రమంతటా వ్యాపించడానికి ఎక్కువ రోజులు పట్టదని వైద్య నిఫుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గత 2019 డిసెంబర్, జనవరి నెలల్లో కరోనా విషయంలో మొదట హెచ్చరించినప్పటికీ వ్యాధి తీవ్రత పెరిగే వరకూ ఏ ఒక్కరూ విశ్వసించలేదని, ఇప్పుడా అలసత్వం వద్దని సూచిస్తున్నారు. ఎవరికివారు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందంటున్నారు.
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు..!
హ్యూమన్ మెటాన్యుమోవైరస్ అచ్చం కరోనా లాంటిదేనని వైద్యవర్గాలు అంటున్నాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుందని, సోకిన మూడు రోజుల్లోనే శరీరంలోని రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుందని, అధికంగా జ్వరం రావడం, దగ్గులు, తుమ్ములు, శరీరంపై దద్దుర్లు, ఒళ్లు నొప్పులు, గ్యాస్ట్రో సమస్యలు దీని లక్షణాలుగా పేర్కొంటున్నారు. న్యూమోనియా పెరిగి ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ప్రస్తుతం కోల్డ్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ పదిహేనేండ్లలోపు పిల్లలు, వయో వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. హెచ్ఎంపీవీ విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంట్లో పిల్లలకు జ్వరం లేదా జలుబు చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలలకు పంపవద్దు. అదేవిధంగా విహారయాత్రలు, ఫంక్షన్స్, ఇతర సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంచాలి. వైద్యులు సూచించిన సలహాలు పాటిస్తూ, మందులు వాడుతూ సొంతంగా కొన్ని స్వీయరక్షణ చర్యలు పాటించాలి. కరోనా కాలంలో మాదిరి ముఖానికి మాస్క్‌లు ధరించాలి. తినే ముందు చేతులను శానిటైజర్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. రోజువారీగా మంచి పోషకాహారం పెడుతూనే నిమ్మరసం విధిగా తాగించాలి. ఎండలో కూర్చోబెట్టాలి. గోరువెచ్చని నీటిలో కాసింత ఉప్పును కలిపి ముక్కులో నుంచి వచ్చేలా శుభ్రం చేయించాలి. రాత్రి పడుకునే సమయంలోనూ మూడు, నాలుగు దఫాలు ఉప్పు నీటితో నోటిని పుక్కిలించి ఉమ్మేయాలి.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం..
కరోనా మహమ్మారిని తలపించే హెచ్ఎంపీవీ వైరస్ దేశంలోకి ప్రవేశించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశానుసారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతిబాయి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సమాయత్తమయ్యారు. తమ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యులు, సూపర్వైజర్లు, నర్సింగ్, ఆశాలను అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పదిహేనేండ్లలోపు చిన్నారుల ఆరోగ్య వివరాలను సేకరించాలని ఆదేశించారు. సమీప పాఠశాలలకు వెళ్లి స్థానిక ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. బెంగళూరు వరకు వచ్చిన వైరస్ ఖమ్మానికి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. కాగా..! కరోనా మహమ్మారిని ప్రత్యక్షంగా ఎదుర్కొని అష్టకష్టాలు పడిన జిల్లా ప్రజలు మరో వేరియంట్ అనగానే వణికిపోతున్నరు. నాడు వేలల్లో కేసులు, వందల్లో మరణాలను పక్కనబెడితే వైరస్ బారినపడి కోలుకున్న వారు సర్వం కోల్పోయారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీకి ఆస్కారం లేకుండా ముందస్తుగా కఠిన నిబంధనలు విధించాలని సామాన్య జనం కోరుతున్నారు.
స్వీయ జాగ్రత్తలే మేలు..
హెచ్ఎంపీవీ వైరస్ తెలంగాణలోకి రాలేదు. ఒకవేళ వచ్చినప్పటికీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వైరస్ పిల్లలతోపాటు వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపించనున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటిస్తేనే మేలు. ప్రధానంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ వహించకుండా సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. మూడురోజులైనా తగ్గకపోతే వైద్యుల పర్యవేక్షణలో ఉంచి సేవలు అందేలా చూడాలి. ఈ వైరస్ గురించి ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు.
– డాక్టర్ కళావతిబాయి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
ఇలాంటి పనులు చేయకూడదు..