కొణిజర్ల, సెప్టెంబర్ 2: ఇటీవల కురుస్తున్న వర్షాలకు అన్నదాత తీవ్రంగా పంట నష్టపోయారు. మండల కేంద్రమైన కొణిజర్ల, తనికెళ్ల, పల్లిపాడు, సింగరాయపాలెం, తీగలబంజర, గుబ్బగుర్తి, సిద్ధిక్నగర్, అంజనాపురం, గద్దలగూడెం, ఉప్పలచెలక, పెద్దగోపతి, చిన్నగోపతి తదితర గ్రామాల్లో పత్తి పైరు నేలకొరిగింది. సర్కారు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల వరిపంట నేలమట్టం కాగా, ఇతర పంటలకు నష్టం వాటిల్లుతున్నట్లు రైతులు పేర్కొన్నారు.
కొణిజర్ల, సెప్టెంబర్ 2: భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. మండలంలోని తీగలబంజర వద్ద పగిడేరు వాగు, అంజనాపురం సమీపంలోని పెద్దఏరు పొంగి పొర్లడంతో రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. పలుచోట్ల బుంగలు ఏర్పడి రోడ్డు కోతకు గురైంది. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
చింతకాని, సెప్టెంబర్ 2 : మండల పరిధిలో పలు రహదారులు కొట్టుకుపోయినా కనీసం పట్టించుకున్న వారే లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి రహదారులకు ఏర్పడిన గండ్లు పూడ్చి ప్రయాణాలకు, వ్యవసాయానికి అనువుగా చేయాలంటూ రైతులు, ప్రజలు కోరుతున్నారు. బొప్పారంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులకు తహసీల్దార్ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేశారు. నాగిలిగొండ, నేరడ, రాఘవాపురం చెరువు కట్టలకు ఏర్పడిన గండ్లను రైతులు స్వచ్చందంగా పూడ్చివేశారు. సంబంధిత ఎన్నెస్పీ అధికారులు కన్నెత్తి చూడలేదని సదరు గ్రామాల రైతులు వాపోతున్నారు.
చింతకాని, సెప్టెంబర్ 2: మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామంలో మత్య సొసైటీ సభ్యులు ప్రైవేటుగా చేపపిల్లలను రూ.3లక్షలకు కొని పది రోజుల క్రితమే చెరువులో వదిలిపెట్టారు. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహానికి చేప పిల్లలన్నీ కొట్టుకుపోయాయని మత్యకారులు కన్నీటి పర్యంతమయ్యారు. చేప పిల్లలు బయటకు వెళ్ళకుండా రక్షణ వ్యవస్థలో భాగంగా వలలు కూడా ఏర్పాటు చేశామని, కానీ భారీ వరద ప్రవాహనికి వలలు, చేపపిల్లలు సైతం కొట్టుకుపోయాయని మత్యకారులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మత్యసొసైటీ గోడగు రమేష్, మత్యకారులు వేడుకుంటున్నారు.