నమస్తే నెట్వర్క్, ఆగస్టు 13 : వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే ఖమ్మం నగరంతోపాటు దాని పరిసర మండలాల్లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సుమారు నాలుగు గంటల వరకూ ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం జడివానను తలపించింది. దీంతో ఆ సమయంలో నగరంతోపాటు ఆయా మండలాల్లో జనజీవనం స్తంభించింది. రోజంతా ముసురులా కురిసిన వర్షం.. మధ్యాహ్నం నుంచి దంచికొట్టడంతో ఎక్కడివారక్కడ నిలిచిపోయారు. మంగళవారం నుంచి కూడా మోస్తరు వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి, కూసుమంచి, భద్రాద్రి జిల్లా జూలూరుపాడు, చుంచుపల్లి మండలాల్లో కూడా వ్యాప్తంగా బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షపు నీటి కారణంగా ఖమ్మం నగరంలో డ్రైనేజీలన్నీ నిండాయి. వరదనీరు, మురుగునీరు కలిసి రోడ్లపై ప్రవహించింది. ఖమ్మం పాత బస్టాండ్ ఏరియాలో మోకాళ్ల లోతులో నీళ్లు చేరడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నగర శివారులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
దీనికితోడు మరో రెండు మూడు రోజులపాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలతో ఖమ్మంలోని మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పెరుగుతున్న మున్నేరు వరద ఉధృత్తిని చూసి భయాందోళన చెందుతున్నారు. భారీ వర్షాల హెచ్చరికలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మున్నేరు పరిసర ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నాయి. కూసుమంచి మండలంలో కురిసిన భారీ వర్షానికి జీళ్లచెరువు జలదిగ్భందంలో కూరుకుపోయింది. చెరువులు నిండడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది.
కూసుమంచి, ఆగస్టు 13: మండలంలోని పాలేరు రిజర్వాయర్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుండడంతో ఆ ప్రభావం పాలేరుపై పడుతోంది. దీంతో పది వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు బుధవారం ప్రకటించారు. దీంతో వచ్చిన వరద నీటిని 214 గేట్లు ఎత్తి దిగువకు వదులుతూ బ్యాలెన్సింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇరిగేషన్ ఎస్ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, డీఈ ఆనన్య, ఈఈ రత్నకుమారి తదితర నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
చేపలవేట కోసం మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వాయర్‌లోకి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలో సెల్పీలను నిషేధిస్తున్నట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పాలేరు అలుగుల వద్ద ఏర్పాటుచేసిన పోలీసు బందోబస్తున్న బుధవారం ఆయన పర్యవేక్షించారు. అలుగువద్దకు ప్రజలు రాకుండా పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ నుంచి వచ్చే వరదను తగ్గించినప్పటికీ క్యాచ్మెంట్ ద్వారా 8,500 క్యూసెక్కులు, సాగర్ ద్వారా మరో 2 వేల క్యూసెక్కులు కలుపుకొని సుమారుగా 10 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు పాలేరుకు వచ్చి చేరుతోంది.
కిన్నెరసాని నుంచి 4 వేల క్యూసెక్కులు విడుదల
పాల్వంచ రూరల్, ఆగస్టు 13: ఎగువ ప్రాంతాల్లో గత రాత్రి కురిసిన వర్షాలకు కిన్నెరసాని ప్రాజెక్టు నీటిమట్టం పెరిగింది. దీంతో అధికారులు బుధవారం నాలుగు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడు గులు కాగా, బుధవారం రాత్రికి 404.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 1,800 క్యూసెక్కులు ఉండడంతో అధికారులు ఒక గేటు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.