ఉమ్మడి ఖమ్మం జిల్లాను వాన వదలడం లేదు. గడిచిన నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. బుధవారం కూడా అత్యధిక మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా అక్కడక్కడా వాగులు పొంగుతున్నాయి. ఎగువన కూడా వర్షాలు కురుస్తున్న కారణంగా గోదావరిలోకి కూడా కొత్త నీరు చేరుతోంది. దుమ్ముగూడెం, భద్రాచలం వద్ద గోదావరి నదిలో ప్రవాహం పెరిగింది. వాగులు పొంగిన కారణంగా టేకులపల్లి, ములకలపల్లి, తల్లాడ మండలాల్లో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.
సింగరేణి ఉపరితల గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. విరామం లేకుండా వర్షం కురుస్తూ వాగుల్లోకి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అటు అధికారులు, ఇటు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్, ఎస్పీ రోహిత్ రోజు సూచించారు. -ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జూలై 2
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరిలో వరద స్వల్పంగా పెరుగుతోంది. బుధవారం ఉదయానికి 12.10 అడుగుల వద్ద వరద ప్రవహిస్తోంది. భద్రాది జిల్లాలోని ముర్రేడు, కిన్నెరసాని వాగులు కూడా కొత్తనీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్దకు కొత్త నీటి ప్రవాహం పెరగడంతో స్థానికులు వచ్చి చూశారు. దుమ్ముగూడెం మండలంలో 36.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, కిన్నెరసాని ప్రాజెక్టులోకి కూడా స్వల్పంగా వరదనీరు వచ్చి చేరుతోంది.
కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 396.7 అడుగులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి 3,400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టాన్ని అధికారులు 405 అడుగుల వద్ద స్థిరీకరిస్తున్నారు. అధికంగా వచ్చిన నీటిని డ్యామ్ దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తారు. వైరా రిజర్వాయర్ నీటిమట్టం కూడా పెరుగుతోంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 18.2 అడుగులు కాగా.. ప్రస్తుతం 16.3 అడుగులకు చేరింది.
భారీ వర్షానికి ఖమ్మం మున్నేటిలో వరద పెరిగిన కారణంగా ఖమ్మం రూరల్ మండలంలోని నాయుడుపేట, ఖమ్మంలోని కాల్వొడ్డు మధ్యలో మున్నేరు చప్టాపై బైకులు, ఆటోలు, కార్ల రాకపోకలను అధికారులు బుధవారం నిలిపివేశారు. కొద్ది నెలలుగా తీగల వంతెన నిర్మాణం జరుగుతుండడంతో మున్నేరు బ్రిడ్డిపై రాకపోకలను అధికారులు నిషేధించిన విషయం విదితమే. ఇప్పటి వరకూ పాత చప్టా పైనుంచి తక్కువ సామర్థ్యమున్న వాహనాలను అనుమతించారు. బుధవారం తెల్లవారుజామున వరద పెరగడంతో ఆ వాహనాల రాకపోకలను నిలిపివేసి బైపాస్ రోడ్డుకు మళ్లించారు. దీంతో బైపాస్ రోడ్డులోని మున్నేటి వంతెన వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.
భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో నాలుగు రోజులుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనానికి స్వల్ప ఆటంకం ఏర్పడింది. మరో రెండు రోజులపాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. భద్రాద్రి జిల్లాలో కురుస్తున్న వర్షానికి టేకులపల్లి మండలంలో రాళ్లవాగు పొంగింది. తుర్పుగూడెం-స్టేషన్ తడికలపూడి మధ్య కూడా వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు స్తంభించాయి.
ములకలపల్లి – రింగిరెడ్డిపల్లి మధ్య పాములేరు వాగుపై తాత్కాలిక అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలోని తాళ్లపాయ, మంగళిగుట్ట, సుందర్నగర్ గ్రామాల ప్రజలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. తల్లాడ మండలంలోని వాగు పొంగిపొర్లుతుండడంతో వెంగన్నపేట – నూతనకల్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. నూతన బ్రిడ్జి పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కూడా వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది.
చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట మండలాల్లో పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. వరద ధాటికి అన్నపురెడ్డిపల్లి-చండ్రుగొండ రహదారి దెబ్బతిన్నది. అన్నపురెడ్డిపల్లి జీసీసీ పెట్రోల్ బంక్ వద్ద ఆర్అండ్బీ రోడ్డుపై నీరు నిలిచి ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రామకృష్ణాపురంలో పంచాయతీరాజ్ రహదారిపై కూడా వర్షపు నీరు నిలిచింది. అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలోని మోటూరు బాబూరావుకు చెందిన పూరిల్లు నేలకూలింది.
కోయగూడెం, సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఉపరితల గనుల్లో 8,269, 30 వేలు, 8 వేల టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తి పనులు, 38 వేలు, 1.20 లక్షలు, 65 వేల క్యూబిక్ మీటర్ల చొప్పున మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. టేకులపల్లి కోయగూడెం ఓసీ కోల్బెంచ్లోకి చేరిన వరద నీటిని మోటర్ల సహాయంతో బయటకు తోడుతున్నట్లు అధికారులు తెలిపారు.