నమస్తే నెట్వర్క్, జూన్ 25 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం రోజంతా వర్షం దంచికొట్టింది. వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ వర్షాలు తగినంతగా కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. మేనెల అర్ధభాగంలోనే రుతుపవనాలు కదిలి వర్షాలు కురవడంతో అన్నదాతలందరూ అప్పుడే దుక్కులు దున్ని విత్తనాలు వేశారు. ఆ తరువాత వర్షాల జాడలేకపోవడంతో కళ్లలో ఒత్తులేసుకొని ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఒక్కసారిగా మొదలైన వాన.. తరువాత జోరువానగా మారి రోజంతా కురిసింది.
దీంతో విత్తనాలు విత్తి ఉన్న రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇదే క్రమంలో, జూన్ నెల దాటిపోతున్నా తగిన మోతాదులో వర్షాలు కురవకపోవడం, ఎండలు దంచికొడుతూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వంటి కారణాలతో ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా ఉక్కపోతలతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో బుధవారం కురిసిన వర్షం వారికి ఉపశమనం కలిగించింది. కాగా, ఖమ్మం జిల్లా కేంద్రంలో కురిసిన వర్షం కారణంగా నగరంలో జనజీవనానికి కాస్త ఆటంకం ఏర్పడింది. అయితే, రానున్న రెండు రోజులు కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
పాల్వంచ-ములకలపల్లి ప్రధాన రహదారిలో శ్రీనివాసకాలనీ వద్ద రోడ్డుపై వరద నిలిచిపోయింది. దీంతో ములకలపల్లి-పాల్వంచ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీనివాసకాలనీ వద్ద నిర్మించిన కల్వర్టుకు అడ్డంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా మట్టి పోయడంతో పట్టణంలోని వరద నీరంతా వచ్చి అక్కడ నిలిచిపోయింది. దీంతో మున్సిపల్ కమిషనర్ సుజాత వెంటనే స్పందించి జేసీబీ సాయంతో కల్వర్టుకు అడ్డంగా పోసిన మట్టిని తొలగించారు.
దీంతో వరద నీరంతా దిగువ ప్రాంతాలకు వెళ్లిపోయింది. కుండపోత వర్షం, ఈదురుగాలి కారణంగా అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామంలో చెట్టుకొమ్మ విరిగి విద్యుత్ వైర్లపై పైడింది. దీంతో వైర్లు కిందకు వేళాడాయి. ఆ సమయంలో అటుగా వచ్చిన వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఇక బుధవారమేగాక రెండు మూడు రోజులుగా కూడా కురుస్తున్న చిరుజల్లులు, మోస్తరు వర్షాల వల్ల వరదనీరు పంటలు, చెరువులు, కుంటల్లోకి చేరుకుంటోంది.