కూసుమంచి/ తిరుమలాయపాలెం, మే 2: ‘మా ఆరుగాలపు శ్రమ ఫలించింది. పంట చేతికొచ్చింది. తేమ కోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టాం. ఒకటి రెండు రోజుల్లో కాంటాలు వేస్తే ఇక ఫలితం చేతికొచ్చినట్లే..’ అనుకున్న అన్నదాతలను గురువారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం అంతులేని నష్టాన్ని మిగిల్చింది. కూసుమంచి మండలంలో నష్ట తీవ్రత అధికంగా ఉంది. చేగొమ్మ గ్రామంలో ధాన్యపు రాసులు నీట మునిగాయి. గాలిదుమారానికి ధాన్యంపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి.
వర్షానికి ధాన్యమంతా తడిచిముద్దయింది. అలాగే, మరో 10 రోజుల్లో కోయాల్సి ఉన్న మామిడి పండ్లు కూడా ఈదురుగాలులకు నేలరాలాయి. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోనూ, కల్లాల్లోనూ ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. తన ఏడాది కష్టాన్ని సుమారు గంటపాటు వచ్చిన ఈదురుగాలి, వర్షం నేలపాలు చేశాయంటూ గట్టుసింగారానికి చెందిన మామిడి కౌలు రైతు ఎస్కే అలీ ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఉద్యాన వన శాఖ అధికారులకు తెలియజేశానన్నాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరాడు.