పొద్దంతా ఒకటే వాన.. ఆకాశానికి చిల్లు పడిందా.. వరుణుడికే కోపం వచ్చిందా.. అనే రీతిన. ఉపరితల ఆవర్తనం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తోడు కావడంతో మంగళవారం ఉమ్మడి జిల్లాను వర్షం ముంచెత్తింది. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోగా.. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నగరంలోని మురుగు కాల్వలు పొంగి పొర్లడంతో రహదారులపైకి వ్యర్థపు నీటితోపాటు వరద నీరు చేరింది. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి. ముంపు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడ్డారు. వర్షాలతో ప్రజలు ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యారు. రెండు జిల్లాల్లో పోల్చుకుంటే ఖమ్మం జిల్లాలో వర్షం దంచికొట్టింది. పెద్ద వర్షం ఇప్పటికే వేసిన పంటలకు ప్రాణం పోయగా.. అన్నదాతలకు ఆనందాన్నిచ్చింది.
– భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం వ్యవసాయం
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం వ్యవసాయం: ఒకవైపు ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండో రోజు మంగళవారమూ వానలు కురిశాయి. వానలు పత్తి పంటకు ప్రాణం పోశాయి. పునాస పంటలైన పెసర, కంది పంటలకు ఊపిరినిచ్చాయి. మరోవైపు రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి కానున్నది. ఖమ్మం జిల్లాలో వర్షం తీవ్రత ఎక్కువగా కనిపించింది.
గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా 71 మి.మీ వర్షపాతం నమోదు కాగా బోనకల్ మండలంలో అత్యధికంగా 124 మి.మీ నమోదైంది. కూసుమంచి మండలంలో 108 మి.మీ, మధిర మండలం 46.2 మి.మీ, కల్లూరు 58.0 మి.మీ, తల్లాడ 76.4 మి.మీ, కారేపల్లి 58.2 మి.మీ, కామేపల్లి 75.8 మి.మీ, చింతకాని 97.6 మి.మీ, కొణిజర్ల 62.6 మి.మీ, రఘునాథపాలెం 83.6 మి.మీ, సత్తుపల్లి 14.8 మి.మీ, వేంసూరు 25.2 మి.మీ, వైరా 63.2 మి.మీ, తిరుమలాయపాలెం 82.4 మి.మీ, ఖమ్మం రూరల్‌లో 108.6 మి.మీ, ఖమ్మం అర్బన్ 91.4 మి.మీ, నేలకొండపల్లి 68 మి.మీ, ముదిగొండ 64.4 మి.మీ, ఏన్కూరు 82.6 మి.మీ, పెనుబల్లి 35.4 మి.మీ, ఎర్రుపాలెం మండలంలో 50.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా ఖమ్మం నగర పరిధిలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. బేతుపల్లి పెద్దచెరువు అలుగు పోస్తున్నది. తల్లాడ మండల పరిధిలోని నూతనకల్- గూడూరు మధ్య వాగు, కూసుమంచి మండలంలోని కోమటివాగు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆకేరు వాగుకు వరద ఉధృతితో ప్రధాన రహదారిపైకి నీరు చేరింది. దీంతో పల్లెగూడెం, తీర్థాల, మంగళగూడేనికి రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. చెరువు కట్టలు, చెక్‌డ్యాంలు, కాలువల తూములను ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షింస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలో సగటు వర్షపాతం 30 మి.మీగా నమోదు కాగా అత్యధికంగా అశ్వాపురం మండలంలో 58 మి.మీ నమోదైంది. దుమ్ముగూడెం మండలంలో 55 మి.మీ, మణుగూరు 46 మి.మీ, ఇల్లెందు 55 మి.మీ, జూలూరుపాడు 50 మి.మీ, భద్రాచలం 45 మి.మీ, కొత్తగూడెం మండలంలో 47 మి.మీ వర్షపాతం నమోదైంది. వరద కారణంగా చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. సుజాతనగర్ మండలం సింగభూపాలెంలో చెరువు మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉంది. పెనగడప ఎర్ర చెరువు, చుంచుపల్లి చింతలచెరువులు జలకళను సంతరించుకున్నాయి. చండ్రుగొండ, దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాల్లోని చెరువులు శిఖం దాటి ప్రవహిస్తున్నాయి.
భద్రాచలం, జూలై 25: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతున్నది. సోమవారం రాత్రి 8 గంటలకు 36.4 అడుగుల వద్ద ఉన్న ప్రవాహం క్రమంగా తగ్గి మంగళవారం ఉదయం 6 గంటలకు 36.5 అడుగులకు చేరుకున్నది. సాయంత్రం 5 గంటలకు 38.8 అడుగులకు నీటిమట్టం పెరిగింది. మరింత ప్రవాహం పెరగవచ్చని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
పూర్తిస్థాయి నీటిమట్టం : 23 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 23.5
ఆయకట్టు పరిధి : 4.5 లక్షల ఎకరాలు
(ఎగువన కురిసిన వర్షాలకు తోడు.. కృష్ణానది నీరు పాలేరుకు వస్తుంది. సాగర్ డ్యాం నుంచి ఎడమ కాలువకు విడుదలవుతున్న నీరు 3,500 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో 2వేల క్యూసెక్కులు. ఇందులో పాలేరు పాత కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.)
పూర్తిస్థాయి నీటిమట్టం : 18.3 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 17.9
ఆయకట్టు పరిధి : అధికారికంగా 17,500 ఎకరాలు (అనధికారికంగా 25వేల ఎకరాలు)
(ఎగువన కురుస్తున్న వానలకు ఈ రిజర్వాయర్ జలకళను సంతరించుకున్నది. పగిడేరు, పెద్దవాగు, ఇల్లెందు, కామేపల్లిలో కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతున్నది.)
పూర్తిస్థాయి నీటిమట్టం : 16 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 16.1
ఆయకట్టు పరిధి : 10వేల ఎకరాలు
(పూర్తి వర్షాధారంతో ఈ చెరువు నిండింది. దమ్మపేట మండలం నాగుపల్లి, నాచారం, సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి, కాకర్లపల్లి తదితర గ్రామాల్లోని అటవీ ప్రాంతం ద్వారా వరదనీరు చెరువుల్లో చేరి, ఆ చెరువుల నుంచి బేతుపల్లి పెద్దచెరువులోకి వరదనీరు వచ్చి నిండింది. 5 రోజుల క్రితం బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువకు నీటిని విడుదల చేయగా సత్తుపల్లి, వేంసూరు మండలాల్లోని 54 చెరువులకు సాగునీరు అందుతున్నది. ప్రస్తుతం ప్రత్యామ్నాయ కాలువ ద్వారా 450 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది.)
పూర్తిస్థాయి నీటిమట్టం : 19 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 11
ఆయకట్టు పరిధి : 16వేల ఎకరాలు (తెలంగాణ 3వేలు, ఏపీ 13 వేలు)
(అశ్వారావుపేట మండలంలోని ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతోంది. కుడి, ఎడమ కాల్వల ద్వారా తెలంగాణ ప్రాంతంలో 3వేల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 13వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.)
పూర్తిస్థాయి నీటిమట్టం : 407 అడుగులు (8.4 టీఎంసీలు)
ప్రస్తుత నీటిమట్టం : 402.2 అడుగులు (7.85 టీఎంసీలు)
ఆయకట్టు పరిధి : 10వేల ఎకరాలు
(భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, బూర్గంపాడు మండలాల్లోని 10వేల ఎకరాలకు కిన్నెరసాని ద్వారా నీరందుతుంది. కిన్నెరసానికి రెండు కాలువలు ఉన్నాయి. ఎడమ కాలువ ద్వారా 7వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 3వేల ఎకరాలకు నీరందుతుంది.)
పూర్తిస్థాయి నీటిమట్టం : 74 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం : 72.11 మీటర్లు
ఆయకట్టు పరిధి : 25వేల ఎకరాలు
(చర్ల రూరల్ మండంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న అటవీప్రాంత వాగువంకల నుంచి నీరు వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి 16,343 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 8 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి 9,642 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.)
పూర్తిస్థాయి నీటిమట్టం : 15 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 16 అడుగులు
ఆయకట్టు పరిధి : 4,900 ఎకరాలు
(మధిర మండలంలోని జాలిముడి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 35 ఎంసీఎఫ్‌టీ (మిలియన్
క్యూబిక్ ఫీట్)లు. వర్షాలు, వైరా రిజర్వాయర్ ద్వారా వచ్చే నీటి ద్వారా నిండింది. కాలువలు పూర్తికాకపోవడం వల్ల ప్రస్తుతం 3వేల ఎకరాలు మాత్రమే సాగవుతుంది.)
పూర్తిస్థాయి నీటిమట్టం : 18 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 11 అడుగులు
ఆయకట్టు పరిధి : 8వేల ఎకరాలు
(పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతున్నది. లంకపల్లి, ఏరుగట్ల, శ్రీనివాసపురం, మండాలపాడు, చౌడవరం గ్రామ ప్రాంతాల నుంచి వరద నీరు ఈ ప్రాజెక్టులోకి వస్తుంది. పెనుబల్లి, వేంసూరు మండలాలకు సాగు నీరు అందిస్తున్నది.)