ఖమ్మం వ్యవసాయం/ వైరా టౌన్/ పెనుబల్లి, అక్టోబర్ 16: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం బుధవారం ఖమ్మం జిల్లాలో కన్పించింది. ఉదయం నుంచి మేఘాలు అలుముకోవడంతో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఖమ్మం నగరంతోపాటు నగర శివారు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. 30 నిమిషాలపాటు నగరంలో చెదురుమదురు వర్షం కురవడంతో ద్విచక్ర వాహనదారులు స్వల్ప ఇబ్బందులకు గురయ్యారు.
రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, వైరా మండల కేంద్రంలో మాత్రం సాయంత్రం అర్ధగంటపాటు భారీ వర్షమే కురిసింది. ఇక పెనుబల్లి మండలంలో చిత్రమైన పరిస్థితి కన్పించింది. ఉదయం ఎండ దంచి కొట్టింది. మధ్యాహ్నం మబ్బులు కమ్మాయి. సాయంత్రం వర్షం కురిసింది. అది తగ్గినప్పటి నుంచి ఉక్కపోత మొదలైంది. ఇక్కడ 10 రోజులుగా వాతావరణంలో మార్పులు కన్పిస్తూనే ఉన్నాయి. మబ్బులు, గాలులు లేకుండా ఒక్కసారిగా వర్షం కురుస్తోంది.