భద్రాచలం, సెప్టెంబర్ 28: భద్రాచలం వద్ద గోదావరి తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భద్రాచలంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో రామాలయ పరిసరాలు ముంపునకు గురికాకుండా స్థానిక విస్తా కాంప్లెక్సు వద్ద నీటి మళ్లింపునకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
శనివారం రాత్రి 11 గంటలకు 42.70 అడుగులు ఉండగా ఆదివారం ఉదయం 6 గంటలకు 42.10 అడుగులకు తగ్గింది. అనంతరం మళ్లీ గంటకు ఒక అంగుళం చొప్పున పెరగడం ప్రారంభించింది. మధ్యాహ్నం 3 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 43 అడుగులకు చేరుకుంది. రాత్రి 10 గంటలకు 43.70 అడుగులకు చేరుకుంది. వరద మరో మూడు అడుగుల వరకు పెరిగి తగ్గే అవకాశాలు ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.
కాగా, భద్రాచలం వద్ద గోదావరి నెల రోజులుగా 30 అడుగులపైనే ప్రవహిస్తూ ఏజెన్సీవాసులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నెలరోజుల వ్యవధిలో ఆరుసార్లు మొదటి ప్రమాద హెచ్చరికను, రెండుసార్లు రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించింది. సెప్టెంబర్లోనే నాలుగుసార్లు మొదటి ప్రమాద హెచ్చరిక దాటింది.