Bhadradri Kothagudem | కొత్తగూడెం అర్బన్, జూన్ 27 : ఆరోగ్యంపై పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ కోడూరు సుజాత అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో 100రోజుల కార్యాచరణలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) రిసోర్స్ పర్సన్ లకు, మహిళా సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధులను సక్రమంగా నిర్వర్తించగలమని, పట్టణ అభివృద్ధిలో పారిశుద్ధ్య కార్మికులది కీలకపాత్ర అని తెలిపారు. బీపీ, రక్త పరీక్షలు, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ ఇతరత్రా పరీక్షలు నిర్వహించిన తర్వాత పరీక్షలలో ఏమైనా తేడా వుంటే, పెద్దాసుపత్రి రిఫర్ చేసి మెరుగైన వైద్యం చేయిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ పరీక్షలు చేసుకోని వైద్యుల సూచన మేరకు టాబ్లెట్లు, మందులను వాడాలని సూచించారు. ఈ హెల్త్ క్యాంప్‌లో వైద్యులు రాకేష్, దుర్గ, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు అహ్మద్, అశోక్ చౌహాన్, వీరభద్ర చారి, మెప్మా డీఎంసీ రాజేష్, సీవోలు వెంకటేశ్వర్లు, శాంత కుమార్, మౌలానా, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.