ఖమ్మం, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. క్రూరమైన హిట్లర్ రాజ్యాన్ని నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. మంగళవారం ఖమ్మంలోని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇంటి వద్ద రఘునాథపాలెం మండల పరిధి 218 సర్వే నెంబర్లో ఇళ్ల స్థలాలు కోల్పోయిన బాధితులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు, గుడిసెలను కూల్చడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నది పేదలకు ఇళ్లు కట్టించే ప్రభుత్వం కాదని.. పేదలు కట్టుకున్న ఇళ్లను బుల్డోజర్లతో కూల్చే రేవంత్ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘునాథపాలెంలో ఇళ్ల స్థలాలు కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో పేదల ఇళ్లస్థలాలను లాక్కొని దిక్కులేని వారిని చేయడం బాధాకరమన్నారు. కలెక్టర్ దివాకరతో ఫోన్లో మాట్లాడి 218 సర్వే నెంబర్లో ఇళ్లస్థలాలు కోల్పోతున్న పేదలకు అన్యాయం జరుగకుండా చూడాలని కోరారు.
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తున్నాడని హరీశ్‌రావు మండిపడ్డారు. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చేదని గుర్తుచేశారు. తొమ్మిదిన్నర ఏళ్లలో రూ.19,500 కోట్లు ఇచ్చామన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కళాశాలల యాజమాన్యాలు రోడ్డెక్కి ధర్నా చేస్తే వారిని పిలిచి బ్లాక్మెయిల్ చేశాడన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇవ్వాల్సిన నిధులు అడిగితే వారినీ బ్లాక్మెయిల్ చేసిండని, ఎస్బీఐ సొంతంగా కొనుగోలు చేసుకున్న 5 ఎకరాల భూమిని అడిగితే వారినీ బ్లాక్మెయిల్ చేసిండని, ఇలా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ పీఆర్సీ, పెండింగ్ బకాయిలపై అడిగితే వారినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్నారు. మెట్రో రైలును వదిలిపెట్టి పోయేలా ఎల్అండ్టీని బ్లాక్మెయిల్ చేసిండని, జర్నలిస్టులను, సోషల్‌మీడియా యాక్టివిస్టులను, ప్రశ్నించే గొంతులను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. మీ బెదిరింపులకు రోజులు దగ్గపడ్డాయని, ఇంకా రెండేళ్ల 5 నెలలే ఉందని, పేదల ఉసురు పోసుకోవద్దని ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఖమ్మంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జీవో ఇచ్చి లే అవుట్ తయారు చేశారని గుర్తుచేశారు. కానీ, జర్నలిస్టులకు కేటాయించిన స్థలానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెన్షింగ్ వేసి ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టిందని మండిపడ్డారు. ఖమ్మం జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే జర్నలిస్టులందరినీ కూడగల్పుకొని పోయి పొజిషన్ ఇప్పిస్తామని, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోమని హెచ్చరించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ రఘునాథపాలెం మండలం, ఖమ్మం అర్బన్ పరిధిలోని గుట్టలన్నీ మాయమవుతున్నాయని, చదునైన గుట్టల స్థలాలను కాంగ్రెస్ నేతలు కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. 218 సర్వే నెంబర్లో పట్టాలు పొందిన పేదలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధుసూదన్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేశ్‌రెడ్డి, వీరభద్రం, బీఆర్ఎస్ పార్టీ నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, షేక్ షకీనా తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో దండుపాళ్యం బ్యాచ్ దోపిడీ కొనసాగుతోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. రెండున్నరేళ్ల ఈ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధేమీ జరగలేదని, ఏ ఒక్క హామీ అమలుకాలేదని విమర్శించారు. కేసీఆర్ థకాలను విస్మరించిందని మండిపడ్డారు.
ఈ రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరిగిందని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఈసారి అసెంబ్లీ స్థానాలనూ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని తేల్చిచెప్పారు.
ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పుడు ప్రజల చూపంతా బీఆర్ఎస్పైనే ఉందని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు స్పష్టం చేశారు. ముగ్గురు మంత్రులూ మోసగాళ్లుగా తయారయ్యారని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ అని ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. హామీలను గాలికొదిలేసి, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన రేవంత్ పాలన దోపిడీ లక్ష్యంగా సాగుతోందని విమర్శించారు.
అశ్వారావుపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సభా ప్రాంగణంలోకి ఆయన రాగానే గులాబీ కండువాలు చేతపట్టి కేరింతలు కొట్టారు. సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సభలో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు తదితరులు కూడా ప్రసంగించారు.