నార్నూర్ : పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాని కల్పించేందుకు అమలు అవుతున్న కల్యాణ లక్ష్మి( Kalyana Lakshmi ) , షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు, నార్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్ ఆరోపించారు.
సోమవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ( BRS ) శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ఆడబిడ్డల పెండ్లిలకు ఆర్థిక భారం కాకూడదని ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి.. షాదీ ముబారక్ పథకాన్ని తీసుకొచ్చి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు.ఈ పథకంలో తులం బంగారం ఇస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా పథకాన్ని రద్దు చేసేలా ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పథకాలను రద్దు చేసే ప్రయత్నాలు మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేస్రం హన్మంత్ రావు, సీనియర్ నాయకుడు ఉర్వేత రూప్ దేవ్, రాథోడ్ సుభాష్, రాథోడ్ శివాజీ,ఆడా శ్రీ రాం, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.